12to3am | ఏయ్​ వస్తావా?

12to3am | ఏయ్​ వస్తావా?

  • న‌డిరోడ్డుపై పోకిరీల ఆగ‌డాలు
  • క్యా పొట్టీ హై మామా అంటూ కామెంట్స్‌
  • డ్యూటీలో దిగిన లేడీ సింగం
  • పోకిరీల ఆట‌క‌ట్టించేందుకు స్పెష‌ల్‌ ఆప‌రేష‌న్
  • అర్ధరాత్రి ఒంట‌రిగా వీధుల్లోకి పోలీస్‌ క‌మిష‌న‌ర్
  • సామాన్య లేడీగా భావించి అబ్బాయిల‌ వేధింపులు
  • అస‌లు రూపం చూసి భ‌యంతో వ‌ణికిపోయిన ఆక‌తాయిలు
  • ఒక్క రోజే 40 మంది పోకిరీల‌కు అర‌దండాలు
  • బాధ్య‌తలు చేప‌ట్ట‌న‌ రోజే క‌మిష‌న‌ర్ సుమ‌తి సాహ‌సం

12to3am | క్రైమ్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్‌ రోడ్లపై అర్ధరాత్రి ఓ ఆడపిల్ల ఒంటరిగా నిలబడితే.. ఏమైనా ప్రాబ్లమా? సాయం కావాలా? అని బాధ్యతగా అడిగే మగాళ్లు ఎంత మంది ఉంటారు? అలాంటి వాళ్లు ఉంటారో లేదో తెలియదుగాని.. ఎంతకొస్తావ్‌? ఎక్కడికెళ్దాం? అని అడిగే బ్యాచ్‌కు మాత్రం కొదవుండదు. మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలిరోజే పోకిరీ గ్యాంగ్‌ల‌పై ఫోకస్‌ చేసిన సుమతి.. వారికి ఊహించని షాక్‌ ఇచ్చారు.

అర్ధరాత్రి ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. సంచలన ఆపరేషన్ నిర్వహించారు. ఇటీవల కాలంలో అరాచకాలకు అడ్డాగా మారిన దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌ను ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ.. ఒంటరిగా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా.. ఆ ఏరియాకు వెళ్లారు సుమతి. పోలీస్‌ కమిషనర్‌గా కాదు, సగటు మహిళగా రోడ్డుపై బస్సుకోసం ఎదురుచూస్తూ నిల్చున్నారు. అర్ధరాత్రి 12గంటల నుంచి మూడింటి వరకు.. ఆమె అక్కడే ఉన్నారు. కమిషనర్‌గా సెక్యూరిటీ మధ్య కాదు.. కామన్‌ లేడీగా అర్ధరాత్రి రోడ్డెక్కితే.. పరిస్థితి ఎలా ఉంటుందో, కళ్లారా చూశారు.

12to3am | దాదాపు మూడు గంట‌లు..

ఇంతలో అక్కడ అసలు సినిమా మొదలైంది. సుమతి ఎవరో తెలియక పోకిరీలు చుట్టు ముట్టేశారు. అందరూ వస్తావా అనేవాళ్లే? ఎంతివ్వాలంటూ ఆఫర్ ఇచ్చేవాళ్లే? ఎటు వెళ్దామంటూ అడిగే బాపతుగాళ్లే? అసలు ఇప్పటివరకూ ఆడ ముఖమే చూడనట్టుగా ఎగబడిపోయారు కొందరు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు మూడుగంటల పాటు.. దిల్‌సుఖ్‌నగర్‌ మెయిన్‌రోడ్డుపై ఇదే సీన్‌. అటువైపుగా ఒక్క పోలీస్‌ కూడా రాలేదు, పెట్రోలింగ్‌ వెహికిలూ రాలేదు. దీంతో, మరింత రెచ్చిపోయిన పోకిరీలు.. ఆమె తప్పించుకుని ముందుకు వెళ్తున్నా వినలేదు. బైకులు తీసుకొచ్చి ఆమె ముందే ఆపారు. వెకిలి చేష్టలతో విసుగు పుట్టించారు.

సుమతిని చుట్టుముట్టిన పోకిరిల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. వాళ్లంతా మద్యం, గంజాయి మత్తులో ఉన్నారు. ఆ మైకంలోనే.. అసభ్య ప్రశ్నలతో సుమతిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అయినా ధైర్యంతో అక్కడే నిలబడి.. అందర్నీ గమనిస్తూ ఉండిపోయారు సుమతి. చివరాఖరికి సమయం మూడున్నర అవుతుండగా.. అటువైపు వచ్చాడో బీట్‌ కానిస్టేబుల్‌. అప్పటిదాకా ఆమె చుట్టూ మృగాళ్ల మధ్య అక్కడ ఒంటరే. అప్పుడే ఆమె ఎవరో తెలిసింది. ఆ తర్వాత ఓ ఎస్సై వచ్చి సెల్యూట్‌ కొట్టగానే.. ఆమె లేడీ సింగం.. విశ్వనగరపు తొలి మహిళా పోలీస్‌ కమిషనర్‌ ఐపీఎస్‌ సుమతి అని తెలిసిపోయింది. అది చూసి షాకవడం పోకిరీల వంతయ్యింది.

12to3am | కెరీర్ మీద ఫోక‌స్ చేయాలి..

‘‘అప్పటిదాకా.. క్యా పొట్టీ హై మామా’’ అంటూ కామెంటేసిన ఆకతాయిలు.. పోలీస్‌ జీప్‌ ఎక్కాల్సి వచ్చింది. ఈ మూడుగంటల ఆపరేషన్‌లో దాదాపు 40మంది పోకిరీల పనిపట్టారు ఐపీఎస్ సుమతి. వాళ్లందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్​ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులే ఉన్నట్టు గుర్తించారు.

చుట్టూ ఉన్న హాస్టల్స్‌లో నివాసముంటున్న ఈ బ్యాచ్‌.. రాత్రయితే ఇలా రోడ్లమీద పడుతున్నట్టు గుర్తించిన సుమతి.. మూడ్రోజులుగా ఈ ఏరియాపై స్పెషల్‌ ఫోకస్‌ చేశారు. అలాంటి బ్యాచ్‌కు ఇప్పుడు.. అదిరిపోయే షాకిచ్చారు. రోడ్డుపై ఆడపిల్ల కనిపించగానే చొంగ కార్చడం కాదు… చొరవ తీసుకుని వీలైతే సాయం చేయాలని సూచించారు. చదువు, కెరీర్‌ మీద ఫోకస్‌ చేయాలనీ బ్రెయిన్‌ వాష్ చేశారు. మద్యం, గంజాయి అలవాట్లను వదులుకోకపోతే తోకలు కత్తిరిస్తానని హెచ్చరించి పంపించారు.

12to3am | మూడు రోజులుగా నిఘా..
దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతపై వరుస ఫిర్యాదులు రావడంతో కమిషనర్ సుమతి మూడు రోజుల పాటు స్వయంగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించడం, మహిళలను వేధించే యువకులపై నిఘా పెట్టడం, రాత్రివేళల్లో భద్రతా పరిస్థితులను పరిశీలించినట్లు తెలుస్తోంది.

12to3am | అదుపులో పోకిరీలు..

పోలీసుల ప్రాథమిక విచారణలో.. కొందరు యువకులు మద్యం మత్తులో ఉండటం, మరికొందరు గంజాయి మత్తులో తిరగడం, రాత్రివేళల్లో మహిళలను ఇబ్బంది పెట్టడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్ అనంతరం పోలీసులు 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసులు యువకులను ప్రశ్నిస్తూ.. చదువుకునే వయసులో ఇలాంటి చర్యలు ఎందుకు?, మహిళలను వేధించడం వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన పరిణామాల గురించి అవగాహన కల్పించినట్లు సమాచారం.

12to3am | హాస్టల్స్ ప్రాంతంగా దిల్‌సుఖ్‌నగర్..

దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో అధిక సంఖ్యలో హాస్టల్స్ ఉండటంతో రాత్రి వేళల్లో యువకుల సంచారం ఎక్కువగా ఉంటోందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యార్థుల నివాసాలు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో అల్లరి మూకలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక అక్క‌డ కూడా సుమ‌తి స్వ‌యంగా ప‌రిశీలించి అల్ల‌రి గ్యాంగ్ ల‌కు వార్నింగ్ ఇచ్చారు.

Leave a Reply