అక్రమంగా ఉంటున్న వారికి ఓట్లు ఉండవు

  • విదేశీయుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిందే
  • పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
  • ఎమ్మెల్సీ అంజిరెడ్డి

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండకూడదని, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ద్వారా అలాంటి పేర్లను తప్పనిసరిగా తొలగించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు.గురువారం సంగారెడ్డిలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, ప్రభుత్వ ఉద్యోగులు, బూత్ స్థాయి అధికారులు ఎన్నికల నిబంధనల ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రజల్లో అనవసర ఆందోళనలు సృష్టించడం సరికాదన్నారు.భారత పౌరులు కాని, అక్రమంగా దేశంలో నివసిస్తున్న విదేశీయుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ఎన్నికల ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా అమలై 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశ్‌పాండే, మాణిక్‌రావు, గొల్ల భాస్కర్, దోమల విజయ్‌కుమార్, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.