ICDS Officials | అమ్మ ఒడికి దూరం..
ICDS Officials | అమ్మ ఒడికి దూరం..
ICDS Officials | మృత్యుంజయుడైన పసికందు
పాతపట్నంలో కలకలం రేపిన పసికందు ఘటన
ముళ్లపొదల్లో కనిపించిన నవజాత శిశువు
భూదేవి చాకచక్యంతో ప్రాణాలు దక్కిన పసికందు
గ్రామస్తుల సహకారంతో సురక్షితంగా చిన్నారి
పోలీసుల విచారణకు రంగం సిద్ధం
ICDS Officials | పాతపట్నం(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : కన్నప్రేమ కరువైందో, లేక సామాజిక భయమో తెలియదు కానీ, ఊపిరి పోసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ పసికందు ముళ్లపొదల్లో విసిరివేయబడింది. లోకం పోకడ తెలియని ఆ చిన్నారి, తన ఉనికిని చాటుకోవడానికి చేసిన ఆఖరి ప్రయత్నం ఆ పల్లెటూరి పొలిమేరల్లో కలకలం రేపింది. పాతపట్నం మండలంలోని బూరగాం గ్రామంలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సోమవారం చీకటి సమయంలో బహిర్భూమికి వెళ్లిన భూదేవి అనే మహిళకు రోడ్డుకు కొద్ది దూరంలో ఉన్న ముళ్లపొదల్లో నుంచి ఏదో సన్నని శబ్దం వినిపించింది. మొదట జంతువుల అరుపు అనుకున్నప్పటికీ, అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా ఆమె కళ్లు చెమర్చాయి.
అప్పుడే పుట్టిన ఓ మగ శిశువు పలచని బట్ట కూడా లేకుండా ముళ్లపొదల్లో పడి ఏడుస్తూ కనిపించాడు. చలికి వణుకుతూ, ప్రాణాల కోసం పోరాడుతున్న ఆ శిశువును చూడగానే భూదేవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పసికందును అక్కున చేర్చుకుంది. వెంటనే గ్రామంలోకి తీసుకువచ్చి స్థానికులకు విషయం తెలియజేసింది. శిశువు కాలిపై ముళ్ల గీతలు పడి స్వల్ప గాయాలయ్యాయి. రాత్రంతా ఆ చిన్నారికి ప్రథమ చికిత్స అందించి, సురక్షితంగా కాపాడారు. అమ్మ ఒడిలో నిద్రించాల్సిన వయసులో అనాథగా ముళ్లపొదల్లో పడి ఉండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.
ఆ చిన్నారి ప్రాణాలు కాపాడటమే నాకు దక్కిన గొప్ప అదృష్టం అని భూదేవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఆ మగ శిశువు సురక్షితంగా ఉన్నాడని, పూర్తి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఆ చిన్నారిని అక్కడ వదిలేసి వెళ్ళింది ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
