సాగు, త్రాగు నీటి రక్షణకే శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సాగు, త్రాగు నీటి రక్షణకే శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

  • ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మరియు వనపర్తి జిల్లాల్లో సాగునీరు, త్రాగునీరు (మిషన్ భగీరథ)కు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరిన తమ విజ్ఞప్తికి స్పందిస్తూ శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన ఏపీ జెన్కో అధికారులు, ప్రభుత్వానికి టిపిసిసి ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు మంగళవారం గాంధీభవన్‌లో రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి లతో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణా నది జలాల వినియోగం విషయంలో కృష్ణా రివర్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

పైప్రాంతాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగితే దిగువ ప్రాంతాలైన నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీరు అందించడంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులకు సాగునీరు నిరంతరంగా అందేలా చూడాలని డాక్టర్ వంశీకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply