AI Duplicate Votes | ఎన్నికల వ్యవస్థలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం

AI Duplicate Votes | ఎన్నికల వ్యవస్థలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం

AI Duplicate Votes | ఒక వ్యక్తి – ఒకే ఓటు సూత్రంపై ఎన్నికల సంఘం దృష్టి
ఏఐ సాయంతో డూప్లికేట్ ఓట్ల గుర్తింపు
రెండు చోట్ల ఓటు ఉంటే నోటీసులు, చట్టపరమైన చర్యలు
తెలుగు రాష్ట్రాల్లో డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక నిఘా

AI Duplicate Votes | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే నియోజకవర్గం అనే సూత్రం రాబోయే ఎన్నికల సంస్కరణల్లో కీలకంగా మారనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక సమగ్ర సర్వేలో భారీగా డూప్లికేట్ ఓట్లు వెలుగుచూస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో డూప్లికేట్ ఓట్లను ఏరివేస్తున్న ఎన్నికల సంఘం అధికారులు, ఒకటికి మించి ఓటున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ప్రాణాధారం. అయితే కొంతమంది వ్యక్తులు ఉద్యోగాలు, విద్య, వలసలు, ఇతర కారణాలతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారిన తర్వాత కూడా పాత ప్రాంతంలోని ఓటును రద్దు చేసుకోకుండా కొత్త ప్రాంతంలో మళ్లీ ఓటరుగా నమోదు చేసుకుంటున్నట్టు ఎన్నికల సంఘం గుర్తించింది.

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్)లో ఓటరు జాబితాల సమగ్ర ప్రక్షాళనలో ఇటువంటి డూప్లికేట్ నమోదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఒక వ్యక్తి రెండు రాష్ట్రాల్లో ఎన్యూమరేషన్ దరఖాస్తులు భర్తీ చేసినా, రెండు చోట్ల ఓటు హక్కు కొనసాగించినా భవిష్యత్తులో నోటీసులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

చట్టం ప్రకారం ఒక వ్యక్తి సాధారణ నివాసం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఓటరుగా నమోదు కావాలి. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేసుకోవడం చట్టవిరుద్ధం. తప్పుడు సమాచారం ఇచ్చి ఓటరు కార్డు పొందితే అది ఎన్నికల నేరమే.

ఓటరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినప్పుడు పాత ఓటును రద్దు చేసుకుని, కొత్త ప్రాంతంలో పేరు నమోదు చేయించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఏఐతో డూప్లికేట్ ఓట్ల వేటకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. గతంలో డూప్లికేట్ ఓట్ల గుర్తింపు ప్రధానంగా మాన్యువల్ ప్రక్రియ ద్వారా జరిగేది. ఇప్పుడు ఎన్నికల సంఘం సాంకేతికతను వినియోగిస్తోంది.

ఓటరు పేరు, వయస్సు, జనన తేదీ, కుటుంబ వివరాలు, ఫోటోలు, ఆధార్ లేదా ఇతర గుర్తింపు వివరాల సరిపోలిక, రాష్ట్రాల మధ్య డేటాబేస్ క్రాస్ వెరిఫికేషన్ ద్వారా ఒకే వ్యక్తి పేరుతో ఉన్న బహుళ నమోదులను ఏఐ గుర్తిస్తోందని సమాచారం.

ఇంటింటి సర్వేలో వెలుగు చూస్తున్న డూప్లికేట్లు

ప్రత్యేక సమగ్ర సర్వే సందర్భంగా ఇంటింటికీ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కొత్త ఫారాలు భర్తీ చేయిస్తున్నారు. మరణించిన వారి పేర్లు తొలగిస్తున్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలు పరిశీలిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లను గుర్తిస్తున్నారు.

ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాల్లో ఓటు నమోదు ఉన్నట్లు తేలితే సంబంధిత వ్యక్తిని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. డూప్లికేట్ ఓట్లు పెరిగిపోవడానికి కారణం ఉద్యోగాల కోసం వలసలు వెళ్లడం, ఉన్నత విద్యను చదివేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం, వివాహాల కారణంగా నివాస మార్పులు, అవగాహన లేకపోవడం, పాత ఓటును తొలగించకపోవడం వంటి కారణాల వల్ల డూప్లికేట్ నమోదులు పెరుగుతున్నాయని ఈ రంగంలోని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు నిర్ధారణ అయితే ఓటరు జాబితా నుంచి పేరు తొలగించి నోటీసు జారీ చేస్తారు. చట్టపరమైన విచారణ జరిపించి జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షకు కూడా అవకాశం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే కేవలం పరిపాలనా పొరపాటు లేదా పాత నమోదు తొలగించకపోవడం వల్ల జరిగిన సందర్భాల్లో ముందుగా వివరణ తీసుకుని తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు, విద్య, వ్యాపారాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారి సంఖ్య అధికంగానే ఉంది. హైదరాబాద్‌లో నివసిస్తూ స్వస్థలాల్లో కూడా ఓటు కొనసాగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రత్యేక సమగ్ర సర్వే పూర్తయ్యాక డూప్లికేట్ ఓట్ల అసలు సంఖ్య వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఓటరు జాబితాల ప్రక్షాళన వేగవంతం కావచ్చని, భవిష్యత్తు ఎన్నికల్లో మరింత పారదర్శకత సాధ్యమవుతుందని చెబుతున్నారు. సాంకేతికత, ఏఐ ఆధారిత పరిశీలనలు, ప్రత్యేక సర్వేలతో డూప్లికేట్ ఓట్లపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్న వారు స్వచ్ఛందంగా వివరాలను సరిచేసుకుంటే భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చని వివరించారు.