అగ్ని ప్రమాదాల నివారణకు కీలక చిట్కాలు

అగ్ని ప్రమాదాల నివారణకు కీలక చిట్కాలు

  • అగ్ని ప్రమాదాలతో జాగ్రత్త
  • ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకుపైగా ప్రమాదాలు
  • అప్రమత్తమే నివారణకు తొలి మార్గం
  • అగ్నిమాపక పరికరాలు తప్పనిసరి
  • తక్కువ ఖర్చుతో ఇళ్లను రక్షించుకోవచ్చు: నిపుణులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: వేసవి వచ్చిందంటే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో జరిగే అగ్ని ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించే ప్రమాదం ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకుపైగా అగ్ని ప్రమాదాలు నమోదైనట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్‌ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది 8,861 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విద్యుత్ లోపాలే ప్రధాన కారణం
అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో విద్యుత్ లోపాలు ముందుంటాయి. సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకే సాకెట్‌లో ఎక్కువ ప్లగ్గులు పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎంసీబీల పనితీరును నిరంతరం పరిశీలించాలి. ఇంట్లో విద్యుత్ తీగలు దెబ్బతినకుండా చూసుకోవాలి. అవసరం లేని పరికరాలను స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు అన్ని స్విచ్‌లు ఆఫ్ చేశామా లేదా అని నిర్ధారించుకోవాలి.

స్మోక్ డిటెక్టర్ కీలకం
వంటగది, హాలు, పడకగదుల్లో స్మోక్ డిటెక్టర్లు అమర్చితే అగ్ని ప్రమాదాల సమయంలో వెంటనే హెచ్చరికలు అందుతాయి. వీటి ధర రూ.500 నుంచి ప్రారంభమవుతుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదం సంభవించినా స్మోక్ డిటెక్టర్లు శబ్దం చేసి ఇరుగు పొరుగువారిని అప్రమత్తం చేస్తాయి. దీని ద్వారా మంటలు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ఫైర్ స్ప్రింక్లర్లు ఉంటే మరింత రక్షణ కలుగుతుంది. అలారం మోగిన వెంటనే ఇవి నీటిని విడుదల చేసి మంటలను అదుపులోకి తెస్తాయి.

గ్యాస్ సేఫ్టీ అత్యంత ముఖ్యం
ఇంట్లో వంటకు ఉపయోగించే గ్యాస్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వంట పూర్తయ్యాక గ్యాస్ రెగ్యులేటర్‌ను తప్పనిసరిగా ఆపాలి. చాలా అగ్ని ప్రమాదాలకు గ్యాస్ నిర్లక్ష్యం కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఐఎస్ఐ గుర్తు ఉన్న స్టవ్‌లు, పైపులనే ఉపయోగించాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పైపులను మార్చడం మంచిది.

పిల్లలకు అవగాహన అవసరం
ఇంట్లో చిన్నపిల్లలుంటే అగ్గిపెట్టెలు, లైటర్లు వంటి వస్తువులను దూరంగా ఉంచాలి. మంటలతో ఆడుకోవడం ఎంత ప్రమాదకరమో వారికి వివరించాలి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలి, బయటకు ఎలా రావాలి, 101కు ఎలా కాల్ చేయాలి వంటి విషయాల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారు మెయిన్ డోర్, బాల్కనీ మార్గాలను ఎప్పుడూ ఖాళీగా ఉంచాలి. కుటుంబ సభ్యులందరికీ అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలి.

ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ తప్పనిసరి
ఇళ్లలో ముఖ్యంగా వంటగదిలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఏర్పాటు చేసుకోవాలి. చిన్న మంటలు ప్రారంభమైనప్పుడు సాధారణంగా నీరు ఉపయోగిస్తారు. కానీ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉపయోగిస్తే వేగంగా మంటలను అదుపులోకి తీసుకురావచ్చు. పెద్ద ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు రూ.1500 నుంచి అందుబాటులో ఉండగా, బాడీ స్ప్రే తరహాలో చిన్నవీ మార్కెట్‌లో లభిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేవలం రూ.3 వేల వరకు ఖర్చు చేస్తే ఇంటిని అగ్ని ప్రమాదాల నుంచి గణనీయంగా రక్షించుకోవచ్చు. సరైన అవగాహన, జాగ్రత్తలతో అనేక ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుంది.

Leave a Reply