యువతలో దేశభక్తి జ్వాల రగిలించిన ఎన్‌సీసీ శిబిరం

  • ఎన్‌సీసీ క్యాంప్ లో గన్ ఫైరింగ్ పై ప్రత్యేక శిక్షణ
  • 12 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహణ
  • గన్ ఫైరింగ్ శిక్షణను పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలని
  • క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరణ  
  • క్యాడెట్లలో దేశభక్తి, క్రమశిక్షణకు ఎన్‌సీసీ బాట అని స్పష్టం
  • సైనిక స్ఫూర్తితో యువతను తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ కీలక వేదికని వ్యాఖ్య

ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలోని 12 తెలంగాణ బెటాలియన్‌లో కొనసాగుతున్న నాలుగో కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరాన్ని గురువారం డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని సందర్శించారు.

కార్యక్రమంలో భాగంగా ఎన్‌సీసీ క్యాడెట్లు అత్యంత క్రమశిక్షణతో నిర్వహించిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. శిబిరంలో కొనసాగుతున్న ఫైరింగ్ శిక్షణను పరిశీలించి, ఆయుధాలను సురక్షితంగా వినియోగించే విధానం, లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే నైపుణ్యాలపై క్యాడెట్లకు అందిస్తున్న శిక్షణను అభినందించారు.

ఈ సందర్భంగా నర్సింగ్ సైలాని మాట్లాడుతూ.. ఎన్‌సీసీ కేవలం శిక్షణ కార్యక్రమం మాత్రమే కాదని, యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే గొప్ప వేదిక అని పేర్కొన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలంటే క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం ఎంతో అవసరమని సూచించారు.

ఎన్‌సీసీ ద్వారా విద్యార్థులకు సైనిక శిక్షణతో పాటు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే నైపుణ్యాలు, శారీరక దృఢత్వం, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత వంటి విలువలు అలవడతాయని తెలిపారు. దేశ రక్షణ దళాల్లో చేరాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఎన్‌సీసీ మంచి పునాది అవుతుందని, ఇందులో పొందిన అనుభవం భవిష్యత్ ఉద్యోగాలు, ఉన్నత విద్య అవకాశాల్లో కూడా ఉపయోగపడుతుందని వివరించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా ఎన్‌సీసీలో సుమారు లక్షా 20 వేల మంది క్యాడెట్లు ఉన్నారని తెలిపారు. వార్షిక శిక్షణలో భాగంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది క్యాడెట్లను గన్ ఫైరింగ్ శిక్షణ కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. గన్ ఫైరింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎంపిక చేసి తమిళనాడులోని తిరుచిరాపల్లిలో నిర్వహించనున్న ఆల్ ఇండియా ఇంటర్ డైరెక్టరేట్ స్పోర్ట్స్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ (ఐడీఎస్‌ఎస్‌సీ)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ తరఫున పాల్గొనేందుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

షూటింగ్ విభాగంలో శిక్షణ పొందుతున్న క్యాడెట్ల ప్రతిభను పరిశీలించిన ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని.. పోటీల్లో విజయం సాధించేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై విలువైన సూచనలు చేశారు. ప్రతి క్యాడెట్ దేశ ప్రతిష్ఠను నిలబెట్టే బాధ్యతతో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు.

అనంతరం శిబిరంలో పాల్గొన్న ఎన్‌సీసీ క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఎన్‌సీసీ ద్వారా లభించే శిక్షణ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఎన్‌సీసీ ‘ఏ’, ‘బీ’, ‘సీ’ సర్టిఫికెట్లను సద్వినియోగం చేసుకుని భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనతో పాటు ఇతర ప్రభుత్వ రంగాల్లో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ, నిరంతర కృషి ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. యువత ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులతో చర్చించి, వారి సూచనలు పాటిస్తూ సరైన మార్గాన్ని ఎంచుకోవాలని హితవు పలికారు. మంచి విలువలు, మంచి ఆలోచనలతో యువత ముందుకు సాగినప్పుడే దేశ భవిష్యత్తు మరింత బలపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ గ్రూప్ కమాండర్ కల్నల్ పిఎస్ సింగ్ , ఆడం ఆఫీసర్ రాజేష్ కపూర్, క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు ప్రసాద్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.