నాణ్యమైన విద్య అందించాలి- డీఐఈఓ మదర్ గౌడ్
- తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీ
- హాజరు, ప్రవేశాలపై అధ్యాపకులకు కీలక సూచనలు
తొర్రూరు, ఆంధ్రప్రభ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) మదర్ గౌడ్ అధ్యాపకులకు సూచించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, బోధన విధానం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, ఉచిత ప్రవేశాల ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి తరగతుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం డీఐఈఓ మాట్లాడుతూ, విద్యార్థులు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకుంటేనే పరీక్ష ఫీజు స్వీకరిస్తారని తెలిపారు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరై విద్యను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేసి గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలని అధ్యాపకులకు ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల్లో అందిస్తున్న ఉచిత విద్యా సదుపాయాలను పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డి. అరుణ, ప్రోగ్రాం ఆఫీసర్ నారాయణ, సీనియర్ అధ్యాపకులు సువర్ణ, అన్నపూర్ణ, ఉప్పలయ్య, నర్సయ్య, మల్లయ్య, శివరామకృష్ణ, అనిత, రాజేష్, నాగరాజు, కమల్దీప్ రామ్, బ్రహ్మచారి అలీ తదితరులు పాల్గొన్నారు.
