HYD | కస్టమర్ షాక్

HYD | కస్టమర్ షాక్
హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం
HYD |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బయట భోజనం చేయాలంటేనే సందేహాలు కలిగించే పరిస్థితులు నెలకొన్న వేళ, హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. బిర్యానీలో గుట్కా ప్యాకెట్లు బయటపడటంతో కస్టమర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని కినారా గ్రాండ్ హోటల్లో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఓ కస్టమర్ అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి తింటున్న సమయంలో అనూహ్య అనుభవాన్ని ఎదుర్కొన్నారు. బిర్యానీ తింటున్న క్రమంలో వింత రుచి రావడంతో పరిశీలించగా, అందులో గుట్కా ప్యాకెట్ ఉండటం గమనించారు. అప్పటికే తెలియకుండా కొంత భాగం తిన్న కస్టమర్ వెంటనే నోటిలో ఉన్న ఆహారాన్ని బయటకు ఉమ్మేశారు.
తర్వాత ప్లేట్‌ను పూర్తిగా చెక్ చేయగా, మరో గుట్కా ప్యాకెట్ కూడా కనిపించడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. తన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అయితే యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు బాధితుడు ఆరోపించారు. ఈ ఘటన ఆహార భద్రతపై మరోసారి సందేహాలు రేకెత్తిస్తోంది.
