గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: డీఎస్పీ అశోక్ కుమార్

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను సమర్థంగా అరికట్టవచ్చని, ఒక్క సీసీ కెమెరా ఎంతోమంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అసిఫాబాద్ డీఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.

గురువారం సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్‌లో సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల గ్రామపంచాయతీ సర్పంచ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

గ్రామాల్లో దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజాప్రతినిధుల సహకారం పోలీసు శాఖకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ ఆత్రం ఓం ప్రకాష్, జైనూర్ సీఐ రమేష్, సిర్పూర్ (యు) ఎస్‌ఐ కొమురయ్య, లింగాపూర్ ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, మూడు మండలాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.