తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (శనివారం) ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ ఈరోజు (శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు. అయితే, 2018 తర్వాత ఈ సమావేశానికి హాజరవుతున్న తొలి తెలంగాణ సీఎం ఆయనే కావడం విశేషం.
కాగా, సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి “తెలంగాణ రైజింగ్ 2047 విజన్” పేరిట ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న అభివృద్ధి ప్రణాళికలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం నుండి కావలసిన సహకారం వంటి అంశాలు ఉంటాయి.
1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ చేపడుతున్న మార్గాన్ని కూడా వివరించనున్నారు. రాష్ట్రం ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్ రంగాల్లో ఎలా పురోగమిస్తోందో, వాటిని మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తారు.
మౌలిక వసతుల కల్పనలో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు (RRR), రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్‌లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ, స్కిల్స్ యూనివర్శిటీ, ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసి అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మారుస్తున్న అంశాలు ప్రముఖంగా ఉంటాయి.
వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణ మాఫీ, వరి బోనస్, సంక్షేమ పథకాలుగా సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను కూడా సీఎం వివరించనున్నారు.
సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఎస్సీల ఉపవర్గీకరణ, కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న శాసనసభ తీర్మానాలను కూడా సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు.
వీటన్నింటినీ సమగ్ర నివేదిక రూపంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి అందిస్తారు.