డాక్టర్ల సేవలు అమూల్యం – ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని గోకుల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో బుధవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులను శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్య సమయంలో ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే వైద్యులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. వైద్య వృత్తి అత్యంత గొప్పదని, సేవా దృక్పథంతో పనిచేసే డాక్టర్ల కృషిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెజింతల్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, కొత్తకాపు శ్రీధర్ రెడ్డి, మసూద్, కొండారెడ్డి శ్రవణ్ రెడ్డి, వాజిద్, విష్ణు, జలేందర్, దిలీప్, సంగమేష్, అఖిల్, హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
