వెలిదండ పాఠశాల అభివృద్ధికి భారీ సాంస్కృతిక మేళా…

గరిడేపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పాఠశాల రూపురేఖలను మార్చేందుకు, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు మండలంలోని వెలిదండ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కమిటీ నడుం బిగించింది. పాఠశాల అభివృద్ధి నిధుల సేకరణలో భాగంగా మే 3, 2026 (ఆదివారం) సాయంత్రం 5:00 గంటలకు వెలిదండలో భారీ ‘సాంస్కృతిక మేళా’ నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.

నిధుల సేకరణే లక్ష్యం:
“మన ఊరి బడి కోసం – మన విద్యార్థుల మహోన్నత భవిష్యత్తు కోసం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాతల సహకారంతో పాఠశాలలో పలు వసతులు సమకూరగా, మరిన్ని ఆధునిక విద్యా సౌకర్యాల కోసం ఈ సాంస్కృతిక ప్రదర్శన ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించారు. ప్రజా కళాకారులు స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం.

హాజరుకానున్న ప్రముఖులు:
ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, విద్యా, సామాజిక రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. విశిష్ట అతిథులుగా ఐఏఎస్ అధికారి, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూరి మురళి, ప్రముఖ సినీ నిర్మాత–దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీం పాల్గొననున్నారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పోటు రంగారావు, వి. కోటేశ్వరరావు తదితరులు హాజరవుతారు.

కళాకారుల సందడి:
ప్రముఖ ప్రజా గాయని విమలక్క, ప్రకృతి కవి జయరాజ్, ఏపూరి సోమన్న, యశ్ పాల్, యోచన, నాగరాజు, కుంట శ్రీనివాస్ తదితర కళాకారులు తమ పాటలు, ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు వి.వి. నర్సింహారావు, ఎం. నాగబాబు మాట్లాడుతూ గ్రామస్తులు, దాతలు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సాంస్కృతిక మేళాను విజయవంతం చేయాలని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉదారంగా విరాళాలు అందించాలని కోరారు.

Leave a Reply