48 గంటల్లో బిహారి హత్య కేసు ఛేదించిన పోలీసులు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ అజాం జాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన బిహారి వ్యక్తి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. కేవలం 48 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. గురువారం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ బొల్లం రమేష్ వివరాలు వెల్లడిస్తూ ,బిహార్ రాష్ట్రానికి చెందిన తాన్వీర్ అలం (23) ఉపాధి కోసం మూడు నెలల క్రితం వరంగల్‌కు వచ్చి రామన్నపేటలో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల ఒత్తిడి కారణంగా డబ్బు కోసం తహతహలాడుతున్న నిందితుడు, ఏప్రిల్ 18న అండర్ బ్రిడ్జ్ సమీపంలోని వైన్ షాప్ వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన దూరిషా (60) అనే వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకున్నాడు.

పరిచయాన్ని స్నేహంగా మార్చుకున్న నిందితుడు, బాధితుడి వద్ద డబ్బు ఉందని గమనించి దోపిడీకి పథకం రచించాడు. అనంతరం ఇద్దరూ రంగశాయిపేటలోని బాధితుడి గదికి వెళ్లి మద్యం సేవించారు. మద్యం మత్తులో బాధితుడు నిద్రలోకి జారుకున్న సమయంలో అతని వద్ద ఉన్న నగదును దొంగిలించడానికి ప్రయత్నించగా, బాధితుడు మేల్కొని ప్రతిఘటించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో తనపై కేసు నమోదవుతుందనే భయంతో నిందితుడు అక్కడే ఉన్న కత్తితో దాడి చేసి బాధితుడిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం రూ.4,500 నగదును దోచుకుని, నేరానికి ఉపయోగించిన కత్తిని సమీపంలోని పొదల్లో పడేసి అక్కడి నుండి పరారయ్యాడు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు సమాచారదారుల సహకారంతో నిందితుడిని శంబునిపేట జంక్షన్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నేర సమయంలో ధరించిన దుస్తులు మరియు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి. రమేష్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, జె.శ్రవణ్ కుమార్, ఎల్ నరేష్, హెడ్ కానిస్టేబుల్ ఏ నరేందర్ కానిస్టేబుల్ ఎండి వాజిద్ భాష ఎం ప్రవీణ్ రెడ్డి చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఈ కేసును వేగంగా ఛేదించారు. ఈ కేసును తక్షణమే పరిష్కరించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply