Konda Surekha | మంత్రి పనులు కడియం ఎలా చేస్తారు?..
Konda Surekha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. దేవాదాయ శాఖ వ్యవహారాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని మంత్రి సురేఖ ఆరోపించారు.
మీడియతో ఆమె మాట్లాడుతూ… తాను, తన భర్త కలిసి కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే, ఆయన వ్యవహారశైలి చూస్తే రాజీ పడే ఉద్దేశం కనిపించలేదని అన్నారు. ఇంట్లో ఉన్న తనను బయటకు రప్పించారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“మంత్రి చేయాల్సిన పనులు కడియం ఎలా చేస్తారు?” అని ప్రశ్నించిన సురేఖ.. గత మూడు నెలలుగా అధికారులపై ఆయన ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. అందుకే కొన్ని సమావేశాలకు హాజరుకావాల్సి వచ్చిందని అధికారులు తనకు చెప్పారని వెల్లడించారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే ఈ నెల 14న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి పూర్తి వివరాలు వివరిస్తానని వెల్లడించారు.
ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావిస్తూ.. “నా జీవితమంతా ముళ్లబాటే” అని సురేఖ వ్యాఖ్యానించారు. అయోధ్య రామాలయం విరాళాల వ్యవహారంపై స్పందిస్తూ, శ్రీరాముడి పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిని చివరకు శ్రీరాముడే శిక్షిస్తాడని అన్నారు.
