జీయర్ గురుకులం జూనియర్ కళాశాలను సందర్శించిన నిర్మల్ డీఐఈఓ

కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లి గ్రామంలో జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీయర్ గురుకులం జూనియర్ కళాశాలను నిర్మల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) పరశురాం గురువారం సందర్శించారు.

2026–27 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ కోర్సుల అనుమతుల ప్రక్రియలో భాగంగా కళాశాలలోని పత్రాలను ఆయన పరిశీలించారు. అధ్యాపకుల విద్యార్హతలు, సంబంధిత ధ్రువపత్రాలను తనిఖీ చేయడంతో పాటు సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, అగ్నిమాపక భద్రతకు సంబంధించిన పత్రాలు, ఇతర మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

పరిశీలన అనంతరం కళాశాలలో కల్పించిన సౌకర్యాలను డీఐఈఓ అభినందించారు. అనుమతుల ప్రక్రియకు సంబంధించి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

ఈ కార్యక్రమంలో శాంతారాం స్వామి, జీయర్ గురుకులం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చక్రధర్, కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.