Former Minister | కాళేశ్వరాన్ని కించపరిస్తే, ముక్తేశ్వరుడి శిక్ష తప్పదు
Former Minister | కాళేశ్వరాన్ని కించపరిస్తే, ముక్తేశ్వరుడి శిక్ష తప్పదు
- మేడిగడ్డ మరమ్మతులు చేతగాక, తమ్మిడిహట్టి వద్ద డ్రామాలు
- కాంగ్రెస్ మంత్రులకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదు
- రెచ్చగొట్టడం మానేసి, కేసీఆర్ లెక్క రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలి
- తక్షణమే మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేసి రైతాంగానికి సాగునీరివ్వాలి
- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
Former Minister | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కటిక చీకట్లో కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బంగడుపుతన్నారని, తమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, బీఆర్ఎస్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వచ్చే ఏడాది రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది ఎల్‌నినో వల్ల దేశమంతా కరువు వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారని, ఎంత కరువొచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే స్థలం మేడిగడ్డేనని తేల్చిచెప్పారు.
వాగుడు తప్ప చేతలు శూన్యం..
ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావిడి చూసిన తర్వాత ఒక విషయం అర్థమవుతోంది, పని తక్కువ ప్రచారం ఎక్కువ. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యం అని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని తెలిసినప్పుడు హడావిడిగా బాయి తవ్వినట్లు కాకుండా, ముందస్తుగా మేడిగడ్డ రిపేర్లు చేయాలన్నారు.
కానీ అది వదిలేసి తమ్మిడిహట్టి కడుతున్నట్లు పేపర్లకు ఫోజులిస్తున్నారు. కురచ బుద్ధితో బీఆర్ఎస్ పై బురద జల్లే కార్యక్రమం తప్ప వారు చేస్తున్నది శూన్యమని చెప్పారు. 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పందం జరిగిందని మంత్రి వివేక్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ప్రజలు ఏమనుకుంటారన్న సోయి లేకుండా ఇంత పిచ్చి అబద్ధం మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.
30 నెలలుగా కాంగ్రెస్ ను ఎవరాపారు?
మేం మంత్రులం ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని అతి విశ్వాసంతో వాళ్లు మాట్లాడుతున్నట్లుంది. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నాడు. కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఆయన తన అవివేకాన్ని బయటపెట్టుకున్నాడని విమర్శించారు. మొన్న హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి సుందిళ్ల బ్యారేజ్‌కు నీళ్లు తెస్తాం అంటారు.
సీఎం రేవంత్‌రెడ్డి తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి లిఫ్టుతో నీళ్లు తెస్తామంటాడు. మంత్రి జూపల్లి ఏమో లిఫ్ట్ అవసరం లేదు, గ్రావిటీ ద్వారా వస్తాయి అంటారు. ఎవరు చెప్పేది నిజమో వారికే తెలియదని అన్నారు. ఈ అజ్ఞానపు మాటలతో రాష్ట్ర పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే కేసీఆర్ నాయకత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా నేను, అధికారులు మహారాష్ట్రకెళ్లి అక్కడి సీఎంను కలిసి విజ్ఞప్తి చేశాంమని గుర్తు చేశారు.
కేసీఆర్ పుట్టినరోజునే..
కేసీఆర్ పుట్టినరోజునే రాష్ట్ర ప్రయోజనాల కోసం మహారాష్ట్ర సీఎంతో సమావేశమయ్యారని చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద ఎకో సెన్సిటివ్ జోన్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాకుండా, మేనిఫెస్టోలో పెట్టి డైలాగులు కొట్టడం తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 2024-25 బడ్జెట్లో పెట్టింది 2 కోట్లు, 2025లో 30 కోట్లు, ఈ ఏడాది 50 కోట్లు. మొత్తం 82 కోట్లతో ప్రాజెక్టు పూర్తవడం సాధ్యమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రాణహిత చేవెళ్లను కట్టకుండా సమయం వృధా చేశారని అన్నారు.
కాంగ్రెస్ డీఎన్ఏలోనే కరప్షన్
తట్టెడు మట్టి ఎత్తకుండా, కనీస సర్వే లేకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ. 2300 కోట్లు బిల్లులు లేపారని, కరప్షన్ కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల పనులకు, ల్యాండ్ అక్విజిషన్ కు ఖర్చు చేసింది రూ. 3780 కోట్లు. కానీ సీఎం 11 వేల కోట్లు పూర్తయ్యాయి అని పచ్చి అబద్ధం చెబుతున్నారని తెలిపారు.
కేసీఆర్‌కు పేరొస్తుందనే పనులు నిలుపుదల
పలు పార్టీలు మారిన రేవంత్ ఊసరవెల్లి రంగులు మార్చినట్టు ఒక్కో పార్టీలో ఒక్కో మాట మాట్లాడటం ఆయన నైజమని, రెండు పిల్లర్లకు మరమ్మతులు చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే పనులు ఆపుతున్నారు. కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ తాగు, సాగునీటి అవసరాల కోసం ఇంజినీర్లతో చర్చించి ప్రాజెక్టు కట్టారని చెప్పారు.
కాళేశ్వరాన్ని తక్కువ చేసి మాట్లాడితే, అది కేసీఆర్‌ను తక్కువ చేసినట్లు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి, జాతికి మీరు చేస్తున్న ద్రోహమని హరీష్ అభివర్ణించారు. కాళేశ్వరాన్ని కించపరిస్తే, అందులో కొలువైన ముక్తేశ్వరుడు మీకు కచ్చితంగా శిక్ష వేస్తాడు, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తమ్మిడిహట్టి జలహారతుల డ్రామాలు కట్టిపెట్టి, వెంటనే మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
