విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి..

కుంటాల (ఆంధ్రప్రభ): విద్యార్థుల ఆహార పట్టికను పకడ్బందీగా అమలు చేసి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. బుధవారం మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వసతి గృహంలోని సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించడంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

హాస్టల్‌లోని పారిశుధ్యం, తాగునీటి సౌకర్యం, వంటశాల, భోజనశాల, మరుగుదొడ్లు, వసతి గదులను పరిశీలించిన ఆయన సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వార్డెన్‌కు సూచించారు. రోజువారీ ఆహార పట్టిక, సరుకుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు నాణ్యమైన బోధన అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేసి రికార్డులను పరిశీలించారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, పంచాయతీ కార్యదర్శి రాజాబాపు, వార్డెన్ సాయి ప్రద తదితరులు పాల్గొన్నారు.