ఇద్దరు ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఆదేశాలు

  • వేరే పాఠశాలల్లో తక్షణమే విధుల్లో చేరాలని సూచన

ఆంధ్రప్రభ, జన్నారం (మంచిర్యాల జిల్లా) : జన్నారం మండలంలోని తిమ్మాపూర్ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హిందీ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు రాథోడ్ రాజు, ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఎ. సురేందర్‌లను వేరే పాఠశాలలకు పంపిస్తూ జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరిని వెంటనే విధుల్లో చేరాలని సూచించినట్లు అధికారులు తెలిపారు.

గత వారం పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో స్థానిక ఎంఈఓ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. హిందీ స్కూల్ అసిస్టెంట్ రాథోడ్ రాజును జిల్లాలోని నెన్నెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఎ. సురేందర్‌ను కోటపల్లి మండలం నాగంపేట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిప్యూటేషన్‌పై నియమించారు. ఈ విషయాన్ని స్థానిక ఎంఈఓ బి. రాజేందర్ రాత్రి 9 గంటలకు ధృవీకరించారు.