jagan | టెట్ నిబంధనలతో ఇబ్బందుల్లో టీచర్లు
jagan | టెట్ నిబంధనలతో ఇబ్బందుల్లో టీచర్లు
మినహాయింపు ఇవ్వాలని జగన్ డిమాండ్
2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం అన్యాయమన్న వైఎస్ జగన్
చట్ట సవరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబుకు సూచన
టెట్ కారణంగా ప్రమోషన్లు, ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన మాజీ సీఎం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.
టెట్ నిబంధనల అమలు కారణంగా దాదాపు లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. 2011కు ముందే ఉపాధ్యాయులుగా నియమితులై 20 నుంచి 25 ఏళ్లుగా సేవలందిస్తున్న వారిని కూడా టెట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని, అంతేకాకుండా కనీసం 60 శాతం మార్కులు సాధించాలని నిబంధన విధించడం సమంజసం కాదని అన్నారు.
ఉపాధ్యాయులుగా నియామకం పొందిన సమయంలో టెట్ అనే పరీక్షే అమల్లో లేదని, అప్పటి డీఎస్సీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన తర్వాతే వారికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. అలాంటి వారిపై ఇప్పుడు కొత్త నిబంధనలను వర్తింపజేయడం న్యాయసమ్మతం కాదని అభిప్రాయపడ్డారు.
జాతీయ విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, అంటే 2011 నుంచి టెట్‌ను తప్పనిసరి చేశారని, అయితే ఆ చట్టానికి ముందే ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు అదే నిబంధన వర్తింపజేయడంపై ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల్లో న్యాయం ఉందని పేర్కొన్నారు. టెట్ నిబంధనల వల్ల పదోన్నతులు నిలిచిపోవడంతో పాటు ఉద్యోగ భద్రతపై కూడా అనిశ్చితి నెలకొందని, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని జగన్ తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చొరవ చూపలేదని విమర్శించారు.
చట్ట సవరణ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపే దిశగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. 2011కు ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
