tirumala | టీటీడీ బోర్డులో చేరిన కన్నబాబు

tirumala | టీటీడీ బోర్డులో చేరిన కన్నబాబు

టీటీడీ ధర్మకర్తల మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కార్యదర్శి ప్రమాణ స్వీకారం
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కె. కన్నబాబు..
వేదాశీర్వచనం, తీర్థప్రసాదాల అందజేత

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మకర్తల మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కార్యదర్శి శ్రీ కె. కన్నబాబు బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి (అదనపు ఈవో) శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి శ్రీ కన్నబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, శ్రీ కన్నబాబుకు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య విజిలెన్స్ మరియు భద్రతాధికారి (సీవీఎస్వో) శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీమతి ప్రశాంతితో పాటు టీటీడీకి చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.