Amarnath | మంచు శివలింగం అంతర్ధానం..

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వార్షిక అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే పవిత్ర గుహలోని సహజసిద్ధ మంచు శివలింగం దాదాపు పూర్తిగా కరిగిపోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. మే నెలలో సుమారు ఏడు అడుగుల ఎత్తుతో కనిపించిన మంచు శివలింగం ప్రస్తుతం 99 శాతం మేర క్షీణించినట్లు అధికారులు వెల్లడించారు. గత మూడు సంవత్సరాలుగా కూడా యాత్ర ప్రారంభమైన వారం రోజుల్లోనే మంచు శివలింగం కరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

పర్యావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ప్రాంతీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో తగినంత మంచు కురవకపోవడం, తీవ్రమైన ఉష్ణగాలుల ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు రోజూ వేల సంఖ్యలో భక్తులు గుహను సందర్శించడం వల్ల ఏర్పడుతున్న మానవ ఉష్ణోగ్రత, కాలుష్యం కూడా మంచు శివలింగం వేగంగా కరిగిపోవడానికి కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం రోజుకు సుమారు 13 వేల నుంచి 20 వేల మంది వరకు యాత్రికులు అమర్‌నాథ్ గుహను సందర్శిస్తున్నారు. జూన్ 28న ప్రారంభమైన 57 రోజుల యాత్రలో ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

మంచు శివలింగం కరిగిపోయినప్పటికీ, అమర్‌నాథ్ క్షేత్రం ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని భక్తులు చెబుతున్నారు. ప్రభుత్వం కల్పించిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, యాత్రికులకు అందుబాటులో ఉంచిన వసతులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాత్రను మరికొన్ని రోజులు ముందుగానే ప్రారంభించి ఉంటే ఎక్కువ మంది భక్తులకు మంచు శివలింగ దర్శనం లభించేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.