sharmila | జీవో 975 వెనక్కి తీసుకోవాలి..
sharmila | జీవో 975 వెనక్కి తీసుకోవాలి..
మున్సిపల్ కార్మికులపై చంద్రబాబుకు శర్మిల లేఖ
ప్రైవేటీకరణతో వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన
జీవో నెం.975ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్
కార్మికుల న్యాయమైన పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : మున్సిపల్ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందంటూ జీవో నెం.975ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ శర్మిల లేఖ రాసింది. ప్రైవేటీకరణ పేరుతో కార్మికుల ఉపాధిని ప్రమాదంలోకి నెట్టే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
మున్సిపల్ సేవల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవో నెం.975పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ జీవో అమలుతో మున్సిపల్ కార్మికుల జీవనాధారం దెబ్బతింటుందని, వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులను రోడ్డున పడేసే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని కాంగ్రెస్ నాయకత్వం పేర్కొంది. ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చి, కార్మికుల ప్రయోజనాలను విస్మరించడం సరైన విధానం కాదని విమర్శించింది.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ రంగాల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని ఆరోపించిన కాంగ్రెస్, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే నిర్ణయాలను పునఃపరిశీలించాలని కోరింది. జీవో నెం.975ను వెంటనే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసినట్లు కాంగ్రెస్ తెలిపింది. అలాగే మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని, వారి హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్మిక ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించిన కాంగ్రెస్, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలు తగిన సమయంలో తీర్పు ఇస్తారని పేర్కొంది.
