నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్‌లు: ఏఎస్పీ పత్తిపాక సాయికుమార్

కుంటాల (ఆంధ్రప్రభ): నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతా అవగాహన కల్పించడానికే కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని భైంసా ఏఎస్పీ పత్తిపాక సాయికుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని పెంచికల్‌పాడు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అన్ని పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల సంచారం గమనించినా, సైబర్ మోసాలకు సంబంధించిన అనుమానాస్పద ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాత వాహనాలు కొనుగోలు చేసే ముందు సంబంధిత పత్రాలను పూర్తిగా పరిశీలించాలని తెలిపారు.

కార్డన్ సెర్చ్ సందర్భంగా సరైన పత్రాలు లేని 73 వాహనాలను సీజ్ చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో భైంసా గ్రామీణ సీఐ ప్రవీణ్‌కుమార్, కుంటాల, భైంసా రూరల్, కుబీర్ ఎస్సైలు సి. అశోక్, సుప్రియ, కృష్ణారెడ్డి, సర్పంచ్ కడం హిమ్మత్‌రావు పటేల్, మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.