రూ.1,096.32 లక్షలతో ఆదర్శ గ్రామాల అభివృద్ధి
కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను అన్ని మౌలిక సదుపాయాలతో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏజీవై) పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ, సాధికారత శాఖ అధికారి రబ్బానీ భాష, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో కలిసి పీఎంఏజీవై పనుల పురోగతి, నిధుల వినియోగంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.1,096.32 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
ఇందులో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 117 పనులకు రూ.245.21 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 287 పనులకు రూ.851.11 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 404 అభివృద్ధి పనులు చేపట్టగా, వాటిలో 225 పనులు పూర్తయ్యాయని, 147 పనులు పురోగతిలో ఉండగా, 32 పనులు ఇంకా ప్రారంభం కాలేదని సమీక్షించారు. పూర్తయిన పనులకు సంబంధించిన పరిపాలనా, సాంకేతిక అనుమతులు, ఒప్పంద ప్రక్రియ, పాస్ ఆర్డర్లు, డిజిటల్ ఎం-బుక్ నమోదు, బిల్లుల సమర్పణ, లబ్ధిదారుల ఖాతాలకు నిధుల జమ తదితర ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, పూర్తయిన పనుల బిల్లులను వెంటనే ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. బిల్లుల సమర్పణలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా నిధుల విడుదలకు అవసరమైన అన్ని ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా తాగునీటి సౌకర్యం, అంతర్గత రహదారులు, పారిశుధ్యం, డ్రైనేజీ, విద్యుత్, విద్య, ఆరోగ్యం, అంగన్‌వాడీ కేంద్రాలు, సామాజిక మౌలిక వసతులు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, క్షేత్రస్థాయిలో అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, మంజూరైన ప్రతి రూపాయి పారదర్శకంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, పీఎంఏజీవై కింద చేపట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ రవి ప్రకాష్ నాయుడు, గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయ్ కుమార్, పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు, సహాయ ఇంజనీర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
