ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే ఇదే గతి..

  • రూ.2.5 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి..
  • ఆక్రమణపై అధికారుల ఉక్కుపాదం
  • జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇల్లు కూల్చివేత..
  • కుంట భూమిలో అక్రమంగా నిర్మించిన ఇల్లు..
  • గ్రామస్తుల ఫిర్యాదుతో క‌దిలిన ప్ర‌భుత్వ యంత్రాంగం..

జన్నారం ఆంధ్రప్రభ : ఆక్రమణకు గురైన తాహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల పక్కన గల చెక్కపల్లి కుంట సుమారు 20 గుంటల ప్రభుత్వ భూమి. ఆ భూమి విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అంచనా. కొంతమంది గ్రామస్తుల ఫిర్యాదుతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం. భూమిలో అక్రమంగా వేసిన ఓ పక్క ఇల్లును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలతో పోలీసులు సమక్షంలో రెవెన్యూ, జీపీ అధికార్లు శనివారం ఉదయం కూల్చి వేశారు. తొలుత ఆ ఇంట్లోనే వస్తు సామాగ్రిని బయటకు తీయించి జేసీబీతో కూల్చివేశారు.

ఆక్రమణకు గురైన చెక్కపెల్లి కుంట..

రెవెన్యూ అధికార్ల వివరాల ప్రకారం, జన్నారం మండలంలోని పొనకల్ గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబరు 374లో గల చెక్కపెల్లికుంట 5 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో గత కొంతకాలంగా కొందరు ఆక్రమించుకొని పక్కా గృహాలు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 20 గుంటల కుంట శిఖం భూమిని ఆక్రమణదారులు ఆక్రమించుకొని పక్కా ఇండ్లు, షెడ్లు నిర్మించారు. ఆ భూమి విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని సమాచారం.

ఈ వ్యవహారమై గ్రామానికి చెందిన కొంతమంది జిల్లా కలెక్టర్ కు, స్థానిక తహసిల్దార్ కు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఆ ఫిర్యాదులను గతంలో ఉన్న అధికారులు ప‌ట్టించుకోలేదు. తాజాగా మరికొంతమంది గ్రామస్తులు ఇటీవల జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన కలెక్టర్ ఆక్రమణకు గురైన కుంట శిఖం భూమిని రక్షించాల్సిందిగా ఆదేశించారు.

దీంతో ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని సిమెంట్ ఇటుకలు, రేకులతో నిర్మించిన దుర్గం పోసవ్వ ఇల్లును స్థానిక తాహసిల్దార్ డి.బక్కయ్య, స్థానిక ఎమ్మారై వెంకటేశం సూచనతో స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్, పోలీసులు సహకారంతో జీపీ, రెవెన్యూ ఉద్యోగులు ఇంట్లోనే వస్తు సామాగ్రిని తొలగించి, జేసీబీతో ఆ ఇల్లును కూల్చివేసి, శిధిలాలను తొలగించారు. ఆ ఇంట్లోనికి వస్తు సామగ్రిని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో భద్రపరిచారు.

సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తాం: తహసీల్దార్

ఆక్రమణకు గురైన స్థానిక తాహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల పక్కనే గల పొనకల్ రెవెన్యూ శివారులోని సర్వేనెంబరు 374 లోని చెక్కపల్లి కుంట శిఖం భూమి 5 ఎకరాల 8 గంటలు సర్వే చేయించి హద్దురాళ్లను వేసి, కంచె ఏర్పాటు చేస్తామని స్థానిక తాహసిల్దార్ డి.బక్కయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన పోసవ్వ ఇల్లును తొలగించామన్నారు. పోనకల్ గ్రామ రెవెన్యూ శివారులోని 374లోని కుంట శిఖం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పోసవ్వ ఇల్లు నిర్మించుకుంటూ ఉండగా, పొనకల్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఆర్.రాహుల్ ఆమెకు నోటీసులు ఇచ్చారని ఆయన చెప్పారు. ఎంతటి వారైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే సహించేది లేదని చట్టపరిధిలో చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.