నాలుగేళ్లుగా పెండింగ్‌లో అభివృద్ధి పనుల బిల్లులు

రూ.25.86 లక్షలు ఖర్చు చేసినా చెల్లింపులు లేవని మాజీ సర్పంచ్ బోడ్కా నాయక్ ఆవేదన

అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామపంచాయతీలో గత పాలకవర్గం హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు నాలుగేళ్లుగా విడుదల కాకపోవడంతో మాజీ సర్పంచ్ బోడ్కా నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

2022 నుంచి 2024 మధ్యకాలంలో గ్రామంలో తాగునీటి సౌకర్యాల కల్పన, వీధి దీపాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనుల కోసం రూ.25,86,787 స్వంతంగా ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ పనులకు సంబంధించిన మెజర్‌మెంట్ బుక్ (ఎంబీ) నమోదును పంచాయతీరాజ్ అధికారులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు బిల్లులు విడుదల కాలేదని ఆరోపించారు.

ఆరు నెలల క్రితం కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయని, వాటిలో గత పాలకవర్గం చేపట్టిన పనుల బిల్లులను కూడా చెల్లించాలని అధికారులు సూచించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని పేర్కొన్నారు.

ప్రస్తుత సర్పంచ్ తన హయాంలో చేపట్టిన పనుల బిల్లులకే ప్రాధాన్యం ఇస్తూ, గత బకాయిలను విస్మరిస్తున్నారని విమర్శించారు.

అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి ఖర్చు చేసిన తాను, బిల్లులు రాకపోవడంతో అప్పులపై వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని బోడ్కా నాయక్ వాపోయారు. పనులన్నీ పూర్తయ్యాయని, అధికారులు పరిశీలించి ఎంబీలు నమోదు చేసినప్పటికీ బిల్లుల విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు.

సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేసి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.