విస్తృత అవ‌గాహ‌న‌తోనే విప‌త్తుల‌కు క‌ళ్లెం..

విస్తృత అవ‌గాహ‌న‌తోనే విప‌త్తుల‌కు క‌ళ్లెం..

ఆప‌ద స‌మ‌యంలో అప్ర‌మత్త‌త‌తోనే ర‌క్ష‌ణ‌..
ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు..
డివిజ‌న్‌, నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలోనూ మాక్‌డ్రిల్స్‌..
ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విపత్తుల‌పై ప్రజలు విస్తృత అవగాహన క‌లిగి ఉండటం అత్యంత అవసరమని.. ముందస్తు సిద్ధత, అప్రమత్తతతో ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో జిల్లా అధికార యంత్రాంగం, విప‌త్తు స్పంద‌న‌-అగ్నిమాప‌క శాఖ‌, ఎన్‌డీఆర్ఎఫ్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఫెమిలియరైజేషన్ ఎక్సర్‌సైజ్(ఫామెక్స్‌)-2026లో భాగంగా మాక్‌డ్రిల్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భ‌వ‌నాల్లో అగ్ని ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను కాపాడే విధానంతో పాటు ఫైర్ డెమో, వాట‌ర్ డెమో నిర్వ‌హించారు. అగ్నిప్ర‌మాదాల స‌మ‌యంలో ప్రాణ‌, ఆస్తి నష్టాన్ని త‌గ్గించేందుకు అందుబాటులోకి వ‌చ్చిన అధునాత‌న ప‌రిక‌రాలు, ఫైర్ బాల్ ప‌నితీరు, ఏబీసీ పౌడ‌ర్ ఆధారిత అగ్నిమాప‌క ప‌రిక‌రాలు, క‌మ్యూనికేష‌న్ ఎక్విప్‌మెంట్‌ల పనితీరును ప్ర‌ద‌ర్శించారు.

భూకంపాలు, వ‌ర‌ద‌లు, అగ్నిప్ర‌మాదాలు వంటి విప‌త్తుల స‌మ‌యంలో జాతీయ విప‌త్తు స్పంద‌న ద‌ళం (ఎన్‌డీఆర్ఎఫ్‌) కార్య‌క‌లాపాలపైనా అవ‌గాహ‌న క‌ల్పించారు. కొండ‌పావులూరు ఎన్‌డీఆర్ఎఫ్ ప‌దో బెటాలియ‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.
అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు స‌న్న‌ద్ధతతోనే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలమని.. ఈ క్ర‌మంలో సామాజిక చైత‌న్యం ల‌క్ష్యంగా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. రెవెన్యూ, అగ్నిమాప‌క‌, పంచాయ‌తీరాజ్‌, పోలీస్, ర‌వాణా, ఆర్ అండ్ బీ, ఇరిగేష‌న్ త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న‌ట్లు వివ‌రించారు.

గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు క్షేత్ర‌స్థాయిలో నిరంత‌ర అప్ర‌మ‌త్త‌త కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. వేస‌వి నేప‌థ్యంలో అగ్ని ప్ర‌మాదాలు జ‌ర‌క్కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఒక‌వేళ ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే స‌త్వ‌ర స్పంద‌న చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న కల్పిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ లక్ష్మీశ తెలిపారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, జిల్లా అగ్నిమాప‌క అధికారి ఏవీ శంక‌ర‌రావు, ఎన్‌డీఆర్ఎఫ్ అధికారులు భూపేంద్ర కుమార్, ఆటోన‌గ‌ర్ అగ్నిమాప‌క కేంద్ర అధికారి జి.రామారావు, ఎన్‌డీఆర్ఎఫ్ బృంద స‌భ్యులు కె.వెంక‌టేశ్వ‌ర్లు, ఎస్ఆర్‌కేజీ వెంక‌ట్‌, ఐ.హ‌రికృష్ణ, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply