విద్యాసంస్థల పరిసరాల్లో ఈగల్–పోలీసుల తనిఖీలు..
- సిఓటిపిఎ చట్టం ఉల్లంఘించిన మూడు దుకాణాలకు జరిమానాలు..
- ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ కొనసాగింపు
ఏలూరు టౌన్, ఆంధ్రప్రభ : విద్యార్థులను పొగాకు, మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ కార్యక్రమంలో భాగంగా ఈగల్ విభాగం, ఏలూరు టూ టౌన్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విద్యాసంస్థల పరిసరాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈగల్ ఐజీపీ ఏ.కే. రవికృష్ణ ఐపీఎస్, ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాప్ట చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న మూడు దుకాణాలను గుర్తించి సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు.
అలాగే దుకాణ యజమానులకు చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించి, భవిష్యత్తులో ఉల్లంఘనలు చేయవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈగల్ ఆర్‌ఎస్‌ఐ బి. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను పరిరక్షించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని అన్నారు. చిన్న వయస్సులోనే విద్యార్థులు పొగాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా నిరోధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించినా, విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు అమ్మినా కాప్ట చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ – 1972 గురించి అవగాహన కల్పించారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే 1972కు తెలియజేయాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఈగల్ ఆర్‌ఎస్‌ఐ బి. ఉదయ భాస్కర్ వెల్లడించారు.
