కలాం జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తి..

వికసిత్ భారత్ నిర్మాణమే నిజమైన నివాళి”


(గుంటూరు, ఆంధ్రప్రభ): మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన కలలుగన్న వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి భారతీయుడు కృషి చేయాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా సోమవారం గుంటూరు పట్టాభిపురంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ.. పేపర్ బాయ్‌గా జీవితం ప్రారంభించి దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. మేధస్సు, ప్రతిభ ఉంటే పేదరికం విజయానికి ఎప్పుడూ అడ్డుకాదని తన జీవితంతోనే నిరూపించిన మహనీయుడు కలాం అని కొనియాడారు.

దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసిన అగ్ని, పృథ్వి క్షిపణుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించి “మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. విద్యార్థులంటే అమితమైన ప్రేమ కలిగిన కలాం తన జీవితకాలంలో లక్షలాది మంది యువతతో మమేకమై, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రేరణ ఇచ్చారని గుర్తు చేశారు.

అవినీతి రహిత, విద్యా, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలిచే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడమే అబ్దుల్ కలాంకు అందించే నిజమైన నివాళి అని ఆళ్ళ హరి పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నగర కార్యదర్శి షేక్ మెహబూబ్ భాషా, కోలా అంజి, నండూరి స్వామి తదితరులు పాల్గొన్నారు.