తాడిచెర్ల కోల్‌బ్లాక్–2 తెలంగాణకు మణికిరీటం
- కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి
మల్హర్‌రావు, ఆంధ్రప్రభ : తాడిచెర్ల కోల్‌బ్లాక్–2 తెలంగాణ రాష్ట్రానికే మణికిరీటంగా నిలవనుందని, సింగరేణి చరిత్రలోనే ఇది అతిపెద్ద బొగ్గు గనిగా అభివృద్ధి చెందబోతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా తాడిచెర్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
తాడిచెర్ల కోల్‌బ్లాక్ అంశం గత రెండు దశాబ్దాలుగా చర్చలో ఉన్న విషయమని, ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకాల ద్వారా ఉపాధి అవకాశాలు, అభివృద్ధి రావాలనే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్‌బ్లాక్–2ను సింగరేణికి కేటాయించే చారిత్రక నిర్ణయం తీసుకుని అమలు చేస్తోందన్నారు.
ఈ గని సుమారు 40 నుంచి 50 సంవత్సరాల పాటు ఉత్పత్తి కొనసాగించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, దాదాపు 350 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఇక్కడి నుంచి వెలికితీయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఈ గని ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ నమోదయ్యే అవకాశముందని వివరించారు.
తాడిచెర్ల కోల్‌బ్లాక్–2 ద్వారా సుమారు 2,000 శాశ్వత ఉద్యోగాలు, 5,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభిస్తాయని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని మంత్రి చెప్పారు. డ్రైవర్లు, హోటళ్లు, లాడ్జీలు, వాహనాల మరమ్మతు కేంద్రాలు, చిన్న పరిశ్రమలు, ఇతర అనుబంధ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలిపారు. దీంతో ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు.
దక్షిణ భారతదేశంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కోల్‌బ్లాక్‌గా తాడిచెర్ల కోల్‌బ్లాక్–2 నిలవబోతోందని, దీనిని “బాహుబలి కోల్ మైన్”గా అభివర్ణించారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి గ్రామ ప్రజలు, సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అవసరమైన అన్ని పర్యావరణ, పరిపాలనా అనుమతులను త్వరితగతిన పూర్తి చేసి, సింగరేణి ద్వారా తవ్వకాల పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
