Guntur | జిల్లా కలెక్టర్ కు వినతుల వెల్లువ..!

Guntur | జిల్లా కలెక్టర్ కు వినతుల వెల్లువ..!

● పి.జి.ఆర్.ఎస్ లో 243 అర్జీలు
● రెవిన్యూ క్లినిక్ కు 152 వినతులు

Guntur | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో 243 వినతులు అందగా, రెవిన్యూ క్లినిక్ కు 152 వినతులు అందాయి. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలితో కలసి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి సోమవారం అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ లో వస్తున్న అర్జీలను పరిశీలించారు. పి.జి.ఆర్.ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో అందిన వినతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ స్వయంగా రెవిన్యూ క్లినిక్ లో కూర్చుని అర్జీలు స్వీకరించారు. రెవిన్యూ క్లినిక్ లో అందిన విన్నపాలను పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్ కు నాలుగు కౌంటర్ లు ఏర్పాటు చేశారు.

Guntur

మొదటి కౌంటర్లో కొత్త డి పట్టా మంజూరు,  డి పట్టాదారుని పేరు రెవెన్యూ రికార్డులలో నమోదు చేయుట,  ప్రభుత్వ మరియు ప్రైవేటు భూముల ఆక్రమణ, నిషేధిత భూములు 22 (ఏ) నుండి తొలగించుట, కొత్త ఇండ్ల స్థలము పట్టాకు అర్జీలు స్వీకరించారు. రెండవ కౌంటర్లో భూ సేకరణ సమస్యలు,  సి.ఆర్.డి.ఏ సమస్యలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిహారం, పౌర సరఫరాలకు సంబంధించిన అంశాలు, ఎఫ్ఎంసి, కులం, పుట్టిన తేదీ, మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర సర్టిఫికెట్లకు, మీ సేవకు సంబంధించినవి అర్జీలు స్వీకరించారు.

మూడవ కౌంటర్లో సుమోటో సవరణలు, ప్రైవేటు భూముల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయుట, కొరిలేషన్ సవరణలు, ఆర్ఓఆర్ సమస్యలు, సివిల్ తగాదాలు,  భూమి మార్పిడి – వ్యవసాయం నుండి వ్యవసాయేతర అంశాలకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. నాలుగవ కౌంటర్లో రీసర్వే సమస్యలు, సర్వే సబ్ డివిజన్ మరియు ఎఫ్ లైన్ హద్దులకు, ఇతర సర్వే సమస్యలకు సంబంధించిన అంశాలు స్వీకరించారు.
పి.జి.ఆర్.ఎస్ లో అందిన కొన్ని ఆర్జీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

గుంటూరు దాసుపాలెంకు చెందిన సి. హెచ్. బుల్లెమ్మ వినతి పత్రం సమర్పిస్తూ మరణించిన తన భర్త పేరును రేషన్ కార్డులో తొలగించి కొత్త కార్డు జారీ చేయాలని కోరారు. గుంటూరు చుట్టుగుంట ప్రాంతానికి చెందిన ఒక మహిళ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పిస్తూ కోరారు. గుంటూరు జొన్నలగడ్డకు చెందిన వంగా రాజశేఖర రెడ్డి వినతి పత్రం సమర్పిస్తూ తుఫాను నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరారు.
గుంటూరు నెహ్రూనగర్ కు చెందిన వి.వి.శివయ్య అర్జీని సమర్పిస్తూ తన గృహాన్ని రిజిస్ట్రేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని కోరారు.

గుంటూరు అడవి తక్కెలపాడుకు చెందిన పి రామచంద్ర రావు ఆర్జీని సమర్పిస్తూ టిడ్కో గృహం కోసం 2017లో లక్ష రూపాయలు చెల్లించేలా, 2018లో ఇల్లు కేటాయిస్తూ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024లో ఇంటిని హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి వరకు నెలకు రూ.3,100 చొప్పున ఐదు సంవత్సరాలు అదే ఇంట్లో నివసించాను. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సమయంలో గతంలో చెల్లించిన లక్ష రూపాయలులలో రూ. 50 వేలు తిరిగి ఇస్తామని చెప్పారు. బ్యాంకు ఈఎంఐ చెల్లింపుకు ఇబ్బంది పడుతున్నందున అద్దె డబ్బులు , డిపాజిట్ మొత్తం ఇప్పించాలని కోరారు.

ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి. విజయ లక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.దుర్గా భాయి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి. నజీనా బేగం తదితరులు పాల్గొన్నారు.