Pemmasani | టెక్స్టైల్ రంగ సమస్యలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తా..
Pemmasani | టెక్స్టైల్ రంగ సమస్యలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తా..
గుంటూరు, ఆంధ్రప్రభ: టెక్స్టైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని పరిశ్రమ ప్రతినిధులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల–గుంటూరు ప్రాంత టెక్స్టైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే కేంద్ర టెక్స్టైల్స్ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న టీయూఎఫ్ఎస్ (TUFS) నిధుల విడుదల, ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు, టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి వంటి అంశాలపై ఫాలోఅప్ చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
పరిశ్రమలకు అత్యంత కీలకమైన గ్రీన్ ఎనర్జీ, క్యాప్టివ్ పవర్ పాలసీ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 75 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కీలక పరిశ్రమ అని పేర్కొన్నారు.
విద్యుత్ వ్యయం పెరగడం, కార్మికుల కొరత, పాత యంత్రాలు, ముడిసరుకు ధరల హెచ్చుతగ్గులు, నీటి కొరత, విధాన పరమైన ఆలస్యాలు వంటి సమస్యలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే పత్తిపై అదనపు సెస్, రైతులు ఎదుర్కొంటున్న తేమ శాతం సమస్యలపై కూడా సంబంధిత శాఖలతో చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని చెప్పారు.
టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెట్ లభించి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పెమ్మసాని అభిప్రాయపడ్డారు. పరిశ్రమల అభివృద్ధి, రైతుల సంక్షేమం, ఉపాధి కల్పన అనే మూడు లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, పరిశ్రమలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
