Gujarat Tragedy | 14 ఏళ్ల చిన్నారి విషాదాంతం
Gujarat Tragedy | 14 ఏళ్ల చిన్నారి విషాదాంతం
Gujarat Tragedy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఆకస్మిక మరణం కలకలం రేపింది. వేసవి సెలవుల సందర్భంగా రాజ్‌కోట్‌లోని తన మేనమామ ఇంటికి వెళ్లిన ఆనంది మోదీ అనే బాలిక.. కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి తిరిగి పిల్లలతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. వైద్యుల చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
ప్రాథమిక వైద్య నివేదికల ప్రకారం గుండెపోటు కారణంగానే ఆమె మరణించి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇంత చిన్న వయసులో బాలిక ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
