మొక్కజొన్న రైతుల గోస తీరాలి..

మొక్కజొన్న రైతుల గోస తీరాలి..

  • సీపీఎం రాష్ట్ర నాయకుడు సాగర్

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్ ఆరోపించారు. మార్కెట్‌లో నిల్వ ఉన్న ధాన్యం, రైతులు పడుతున్న అవస్థలే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

గురువారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డును సందర్శించిన సాగర్, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కార్యదర్శితో మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.

ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ, ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్నను మద్దతు ధరకు అమ్ముదామని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రైతులకు నిరీక్షణ తప్పడం లేదన్నారు. గన్ని బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాల కొరతతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

రైతులు మూడు నెలల కిందటే జిల్లాలో మొక్కజొన్న దిగుబడులపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెలన్నర గడిచినా ఇప్పటికీ మార్కెట్ యార్డుల్లోనే మొక్కజొన్న నిల్వ ఉండటం దురదృష్టకరమన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు రాత్రింబవళ్లు తమ ధాన్యానికి కాపలా కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా వ్యాప్తంగా 2,05,935 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినప్పటికీ కేవలం 15 కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేయడం సిగ్గుచేటని అన్నారు. సుమారు 35 లక్షల గన్ని బ్యాగులు అవసరమైతే ఇప్పటివరకు కేవలం 20 లక్షల బ్యాగులే అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. అందులో కూడా ప్రభావశీల రైతులకు ప్రాధాన్యం ఇవ్వడంతో చిన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర చెల్లించాల్సి ఉండగా, కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు మధ్యదళారులకు రూ.1600కే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. మధ్యదళారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మళ్లీ ప్రభుత్వానికి మద్దతు ధరకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారని విమర్శించారు.

మార్కెట్ యార్డుల్లో హమాలీల కొరత తీవ్రంగా ఉందని, హమాలీలు కూడా మధ్యదళారుల ఆధీనంలో పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే హమాలీలు, లారీలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ రైతుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని సాగర్ ఆరోపించారు. మార్కెట్‌లో నిల్వ ఉన్న మొక్కజొన్న, వడ్లను వెంటనే కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసులు, కందికొండ గీత, దేశ్య నాయక్, జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య, కొంపల్లి అశోక్, తారా సింగ్, హనుమంతు, మధు, వెంకటేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.