రాజీవ్ గాంధీ ఆశయాలు దేశానికి మార్గదర్శకం

రాజీవ్ గాంధీ ఆశయాలు దేశానికి మార్గదర్శకం

  • ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారతదేశపు మాజీ ప్రధానమంత్రి దివంగత శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, కేవలం 40 ఏళ్ల పిన్న వయస్సులోనే భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశంలో కంప్యూటర్, టెలివిజన్ విప్లవానికి శ్రీకారం చుట్టిన నాయకుడిగా రాజీవ్ గాంధీ గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

టెలికాం రంగ అభివృద్ధికి పునాది వేసిన రాజీవ్ గాంధీ, గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని తెలిపారు. యువత రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు.

1991 మే 21న రాజీవ్ గాంధీ మనలను విడిచిపెట్టినా, ఆయన చేసిన సేవలు దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. దేశ సమగ్రత, శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన మహానేతగా ఆయనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని ‘ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం’గా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ దేశ పురోగతికి కృషి చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తీగల సునీంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు హబీబ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జక్కరాజు, అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply