ఆరుగాలం శ్రమ.. అరిగోస పడుతున్న రైతు !

ఆరుగాలం శ్రమ.. అరిగోస పడుతున్న రైతు !
- చౌటుప్పల్‌లో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
- మిల్లుల వద్ద ‘తరుగు’ దోపిడీ.. క్వింటాలుకు 5 కిలోల అదనం !
- లారీల కొరత, హమాలీల సమస్యతో నిలుస్తున్న రవాణా
- పట్టించుకోని సివిల్ సప్లై అధికారులు..
- రోడ్డెక్కేందుకు అన్నదాతల సిద్ధం !
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఆరుగాలం చెమటోడ్చి, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి, పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు మండే ఎండలో అరిగోస పడుతున్నారు. చౌటుప్పల్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా, అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల మాయాజాలం వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండలంలో మొత్తం 21 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో 5, ఐకేపీ మహిళా సంఘాల (IKP) ఆధ్వర్యంలో 12, స్వచ్ఛంద సంస్థ (పీపిసి) ఆధ్వర్యంలో మరో 4 కేంద్రాలు నడుస్తున్నాయి. అయితే కేంద్రాలు కాగితాలకే పరిమితమయ్యాయే తప్ప, ధాన్యం కొనుగోళ్లు మాత్రం వేగవంతం కావడం లేదు. ఇప్పటివరకు కనీసం 25 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది.
మిల్లర్ల ‘దోపిడీ’.. అధికారుల ‘వత్తాసు’!

ధాన్యం తూకాల విషయంలో మిల్లర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పక్కనబెట్టి, మ్యాశ్చూర్ (తేమ శాతం) కరెక్ట్‌గా ఉన్నప్పటికీ క్వింటాలుకు 5 కిలోల పైగా అదనంగా తూకం వేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. దీనికి తోడు ఎండ వేడిమికి లారీల్లోనే రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండటం వల్ల బరువు తగ్గుతోందని, ఆ భారాన్ని కూడా రైతులపైనే వేస్తూ ‘తరుగు, తాలు’ పేరుతో మరింత దోపిడీకి తెరలేపారు. జిల్లా, మండల సివిల్ సప్లై అధికారులు మాత్రం క్షేత్రస్థాయికి వచ్చి రైతుల బాధలను ఆలకించాల్సింది పోయి, మిల్లర్లకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రవాణా బంద్.. హమాలీల కొరతతో ముప్పేట తిప్పలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు తగినన్ని వాహనాలు లేవు. ఒకవేళ లారీలు మిల్లుల వద్దకు వెళ్లినా అక్కడ అన్‌లోడ్ చేయడానికి హమాలీలు రావడం లేదు. మిల్లర్లు ఇచ్చే హమాలీ కూలీ చాలడం లేదని వారు నిరసన తెలుపుతుండటంతో, దిక్కుతోచని స్థితిలో రైతులు తమ సొంత డబ్బులను అదనంగా చెల్లించి హమాలీలతో అన్‌లోడ్ చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
వర్షం వస్తే అంతే సంగతులు…జాతీయ రహదారి దిగ్బంధనానికి సై!

ప్రస్తుతం ఆకాశం మబ్బు పడుతుండటంతో రైతుల్లో వణుకు మొదలైంది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యపు రాసులు అకాల వర్షానికి తడిసి, మొలకెత్తితే తాము కోలుకోలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు జరిపి, లారీల కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ధాన్యం బస్తాలతో జాతీయ రహదారిని దిగ్బంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు.
