వర్షాల సోయగాలతో పచ్చని పరవళ్ళు తొక్కుతున్న అనంతగిరి అడవులు
ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.. వీకెండ్లో పర్యాటకుల సందడి
జలపాతాలు, కొండలు, ఆలయాలు, ఎకో టూరిజంతో అలరిస్తున్న వికారాబాద్ అందాలు
వికారాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రప్రభ): ఇటీవల కురిసిన విస్తారమైన వర్షాలతో వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులు పచ్చని ప్రకృతి వస్త్రాన్ని ధరించి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో, దాదాపు 20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతం ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకులకు కనువిందు చేస్తోంది.
వర్షాలతో కొండలు, గుట్టలు, లోయలు, వాగులు, కాలువలు నీటితో కళకళలాడుతుండగా, దట్టమైన పచ్చదనం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తోంది. ఉదయం వేళల్లో అడవిని కమ్మేసే మంచు, చల్లని గాలులు, పక్షుల కిలకిలారావాలు సందర్శకులకు మరపురాని అనుభూతిని కలిగిస్తున్నాయి. అందుకే ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జహీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు అనంతగిరికి తరలివస్తున్నారు.
అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం భక్తులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే అటవీ శాఖ అభివృద్ధి చేసిన ఎకో టూరిజం పార్కు, ప్రకృతి ఒడిలో నడకకు అనువైన ట్రెక్కింగ్ మార్గాలు, నందిగడ్డ, బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం వంటి ప్రాంతాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతంలోని చిన్న చిన్న జలధారలు, నీటి ప్రవాహాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి.
అనంతగిరి అడవులు ట్రెక్కింగ్, ఫొటోగ్రఫీ, కుటుంబ విహారయాత్రలకు అనువైన ప్రదేశంగా పేరుగాంచాయి. వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు యువత, కుటుంబాలు, ప్రకృతి ప్రేమికులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

రవాణా సౌకర్యం ఇలా…
హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు ప్రతి రోజు తరచూ ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. సికింద్రాబాద్, నాంపల్లి మార్గాల నుంచి వికారాబాద్‌కు రైలు సౌకర్యం కూడా ఉంది. వికారాబాద్ పట్టణానికి చేరుకున్న తర్వాత అనంతగిరి అడవులు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రహదారి మార్గంలో సుమారు 75–80 కిలోమీటర్ల ప్రయాణంతో గంటన్నర నుంచి రెండు గంటల్లో అనంతగిరికి చేరుకునే వీలుంది.
అయితే, వర్షాకాలంలో అడవిలోని కొన్ని ప్రాంతాలు జారుడుగా ఉండే అవకాశం ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రతను కాపాడాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
