తొర్రూరులో శ్రీరామనవమి ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : డివిజన్ కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణంలోని పాటిమీద ఉన్న శ్రీ సీతారామ మందిరంలో తన ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ వసంత నవరాత్ర త్రయాహ్నిక మహోత్సవాలను బుధ, గురు, శుక్రవారాల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ నెల 25న బుధవారం ఉదయం ముత్తైదువులచే పసుపు కొట్టే కార్యక్రమం, అనంతరం విశ్వక్సేన పూజ, కలశ స్థాపన జరుగుతాయి. సాయంత్రం సౌందర్యలహరి సమూహం, తొర్రూరు వారి ఆధ్వర్యంలో సౌందర్యలహరి పారాయణం, అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తారు.

గురువారం ఉదయం స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలుపుట, మధ్యాహ్నం, సాయంత్రం పూజలు జరుగుతాయి. అలాగే వికాస రంగం, తొర్రూరు వారి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం, సుందర సత్సంగ్ సభ్యులచే భజనలు, భగవద్గీత పారాయణం నిర్వహించనున్నట్లు తెలిపారు.

శుక్రవారం ఉదయం 6 గంటలకు రజకుల పూజ, ఉదయం 9 గంటలకు రామమందిరం నుంచి మంగళ వాయిద్యాలతో ఉత్సవ విగ్రహాల శోభాయాత్ర ప్రారంభమై, 10 గంటలకు శివాలయం వద్ద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కళ్యాణం అనంతరం భక్తులకు అక్షింతలు, తీర్థప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం హోమం, పూర్ణాహుతి అనంతరం శ్రీ సీతారామచంద్ర మూర్తి ఉత్సవ విగ్రహాలతో పట్టణ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించనున్నారు.

ఈ ఉత్సవాల్లో వ్యాపార వర్గాల సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మచ్చ సురేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నిర్మల చక్రపాణి, చలువది సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తల్లాడ హీరాధర్‌తో పాటు కమిటీ సభ్యులు మచ్చ లక్ష్మయ్య, చంద్రుడు, శ్రీనివాస్ రావు, ఇమ్మడి రాంబాబు, రేగూరి శ్రీనివాస్, శ్రీధర్, బోనగిరి వెంకన్న, చిత్రపు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply