ఘనంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం.

ఘనంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం.
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బోర్గం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ధరిత్రి గూర్చి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది అని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు తెలిపారు. ఇందులో గెలుపొందిన పదిమంది విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది అని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నియంత్రణపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశమని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు ధరిత్రి అంటే భూమి అని, భూమిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత బాగా జీవించగలుగుతాంఅని, మనం తినే ఆహారం నుండి మొదలు పెడితే కట్టుకునే ఇల్లు తాగడానికి నీరు, ఇంకా ఎన్నో అవసరాలను అందిస్తున్న ఈ భూమిని మనము కలుషితం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు.
పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను ఎక్కడ దొరికితే అక్కడ పడేయడం వల్ల వర్షపు నీరు భూమిలోని ఇంకక ఆవిరైపోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిఅని, చెట్లు పెంచకపోవడం వల్ల వర్షాలు తగ్గి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి భూమి వేడెక్కిపోయి భూగర్భ జలాలు మరీ మరీ తగ్గిపోతున్నాయి అని తెలిపారు.ప్రతి ఇంటికి బోర్లు పెరుగుతున్న ఈ తరుణంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం వల్ల భూమిలో నీటి శాతం పెరుగుతుందిఅని, అందుకే మన పూర్వీకులు భూమిని భూమాతగా పూజిస్తూ కాలుష్యం లేకుండా జాగ్రత్తగా కాపాడుకునేవారు అని ఆయన తెలిపారు.
ఆధునిక వ్యవస్థలో కాలుష్యవేర్థాలన్నీ ఇష్టమొచ్చినట్టు వేయకుండా జాగ్రత్త పడితే మనం భూమిని రక్షించుకునే వాళ్ళం అవుతాం అని, భవిష్యత్తు తరాలైన ఈ విద్యార్థులు తప్పకుండా ఈ భూమిని కాపాడుకునే విధంగా మెలగాలని సూచించారు. మనందరం కలిసి కాలుష్య వ్యర్థాలతో భూమిని కలుషితం చేయకుండా మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తూ స్వచ్ఛమైన భూమిని భవిష్యత్ తరాలకు అందిస్తామని ప్రతిజ్ఞ చేద్దామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, రంజిత్ సింగ్ ఠాకూర్, చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
