బంటారం మండలంలో కలకలం రేపిన అనుమానాస్పద డీఏపీ బస్తాలు
49 బస్తాలు స్వాధీనం.. నమూనాల సేకరణ, విచారణ ప్రారంభం
బంటారం, ఆంధ్రప్రభ: బంటారం మండలంలోని రొంపల్లి గ్రామంలో అనుమానాస్పద డీఏపీ ఎరువుల బస్తాలు కలకలం రేపాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 49 డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
మండల వ్యవసాయ అధికారి శ్రావ్యకు అందిన సమాచారం మేరకు అధికారులు గ్రామానికి చేరుకుని రైతుల వద్ద ఉన్న డీఏపీ బస్తాలను పరిశీలించారు. అనంతరం స్థానిక ఎస్సై విమల పోలీసు సిబ్బందితో కలిసి రైతులను విచారించారు.
విచారణలో రొంపల్లి గ్రామానికి చెందిన రైతులు పెద్దెములు గ్రామానికి చెందిన పోలరాజు వద్ద నుంచి సుమారు 49 డీఏపీ బస్తాలు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
అనుమానాస్పద డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకుని వాటి నమూనాలను సేకరించినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు. ప్రయోగశాల పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
రైతులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగిన ఎరువుల విక్రేతల వద్ద నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని, కొనుగోలు సమయంలో బిల్లు తప్పకుండా తీసుకోవాలని అధికారులు సూచించారు. నకిలీ లేదా అనుమానాస్పద ఎరువులు కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు.
స్వాధీనం చేసుకున్న డీఏపీ బస్తాలను తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బంటారం ఎస్సై విమల, మండల వ్యవసాయ అధికారి శ్రావ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
