పల్లికొండలో భారీ చోరీ

పల్లికొండలో భారీ చోరీ
- 5 తులాల బంగారం అపహరణ
- కుటుంబ సభ్యులు డాబాపై నిద్రిస్తుండగా దోచుకెళ్లిన దొంగలు
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి భారీగా బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. భీమ్గల్ ఎస్సై సిహెచ్. తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ఘటన ఇలా ఉంది.. గ్రామానికి చెందిన తెడ్డు బాబు మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి, నిద్రించడానికి ఇంటి పైకప్పు (బంగ్లా) మీదకు వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో మెలకువ వచ్చి కిందకు వచ్చి చూడగా, ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి షాక్కు గురయ్యారు.
బీరువా పగులగొట్టి దోపిడీ
లోపలికి వెళ్లి పరిశీలించగా సామాన్లు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దొంగలు బీరువా తాళాలు పగులగొట్టి లాకర్లోని 5 తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు గుర్తించారు. వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి క్లూస్ టీం
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ ఘటనతో పల్లికొండ గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
