నో అడ్మిషన్.. ప్రవేశాలు క్లోజ్..! ప్రభుత్వ బడికి ఊహించని ఆదరణ
నో అడ్మిషన్.. ప్రవేశాలు క్లోజ్..! ప్రభుత్వ బడికి ఊహించని ఆదరణ
స్కూల్ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 125 కొత్త అడ్మిషన్లు.. బోర్డు పెట్టిన హెచ్ఎం
జన్నారం, ఆంధ్రప్రభ : “నో అడ్మిషన్.. అడ్మిషన్లు క్లోజ్..” అనే బోర్డు కనిపిస్తే అది ఏదైనా కార్పొరేట్ లేదా ప్రైవేట్ పాఠశాల అనుకుంటారు. కానీ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అక్కపల్లిగూడ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద గురువారం ఇదే పరిస్థితి కనిపించింది. పాఠశాల ప్రారంభమైన కేవలం నాలుగు రోజుల్లోనే 125 మంది కొత్త విద్యార్థులు చేరడంతో అడ్మిషన్లు నిలిపివేస్తూ హెచ్ఎం జాజాల శ్రీనివాస్ బోర్డు ఏర్పాటు చేశారు.
పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఈ పాఠశాలలో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు బోధన జరుగుతోంది. గత విద్యా సంవత్సరంలో 250 మంది విద్యార్థులు చదువుకోగా, ఈ ఏడాది కొత్తగా చేరిన 125 మందితో విద్యార్థుల సంఖ్య 375కు చేరుకుంది. దాతల సహకారంతో పాఠశాలలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రీ-ప్రైమరీ తరగతి గదికి ఏసీ ఏర్పాటు చేయగా, ప్రతి తరగతి గదిలో టీవీలు అందుబాటులో ఉన్నాయి. దిక్సూచి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్ఆర్ఐ భూముల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. డెస్క్‌లు, బెంచీలు, మినరల్ వాటర్ ప్లాంట్‌తో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం పాఠశాలలో హెచ్ఎంతో పాటు ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో మరో ఆరుగురు విద్యా వాలంటీర్లను నియమించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మరో రెండు అదనపు తరగతి గదుల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గత ఏప్రిల్‌లో రూ.25 లక్షలు మంజూరు చేయగా, గదుల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఫిన్లాండ్లో శిక్షణ పొందిన హెచ్ఎం జాజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమన్నారు. మండలంలోని 29 గ్రామపంచాయతీలలో 13 గ్రామపంచాయతీలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాలలో చదువుకుంటున్నారని తెలిపారు. మంజూరైన అదనపు గదుల నిర్మాణం త్వరగా పూర్తయితే మరింత మంది విద్యార్థులకు విద్య అందించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
