ప్రత్యేక ఆకర్షణగా ప్రభుత్వ శాఖల ప్రదర్శనలు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయోత్సవ సభ బుధవారం గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్ లో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా శాఖల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. వికసిత్ భారత్, ఐసీడీఎస్, పశుసంవర్ధక శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, గృహ నిర్మాణ సంస్థ, అటవీ శాఖ, విద్యాశాఖ స్టాల్స్‌లో ప్రభుత్వ పథకాలు, సేవలను వివరించారు.
రతన్ టాటా ఇన్నోవేషన్, ఏపీ విపత్తు స్పందన దళం, అగ్నిమాపక సేవల శాఖలు ఆధునిక సాంకేతికతను ప్రదర్శించాయి. ప్లానింగ్, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థ, పరిశ్రమల శాఖ, జలవనరుల శాఖ, మెప్మా, పర్యాటక శాఖ, నీటి యాజమాన్య సంస్థల స్టాల్స్ సందర్శకులకు ఆసక్తిని రేకెత్తించాయి. స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనూరాధ పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రజలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల ఆవిష్కరణలు, నమూనా ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించడంలో ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.
