టెక్ రంగంలో గేమ్ ఛేంజర్

టెక్ రంగంలో గేమ్ ఛేంజర్
- అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు
- రేపే భూమిపూజ.. తర్లువాడలో చారిత్రక ఘట్టం
- 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 1 గిగావాట్ సామర్థ్యం
- సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన
- మంత్రి నారా లోకేష్, గూగుల్ ప్రతినిధుల రాక
- మారనున్న విశాఖ రూపురేఖలు.. మరిన్ని టెక్ కంపెనీల రాక
- ఏఐ ఆధారిత పరిశ్రమలకు కేరాఫ్‌గా మారనున్న పోర్టు సిటీ
విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: అంతర్జాతీయ టెక్ చిత్రపటంలో విశాఖకు ప్రత్యేక స్థానం దక్కనుంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఈ నగరానికి గేమ్ ఛేంజర్‌గా మారనుంది. బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూలై నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో, మరోవైపు ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులతో ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, సంస్థ ప్రతినిధులు కలిసి భూమిపూజ నిర్వహించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయి.
260 ఎకరాల విస్తీర్ణంలో భూమి సమతలీకరణ (సైట్ లెవెలింగ్) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా 1 గిగావాట్ డేటా సెంటర్లకు భారీ విద్యుత్ అవసరం ఉంటుంది. గూగుల్ తన డేటా సెంటర్లను కార్బన్-రహిత ఇంధనంతో నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు పెరిగే అవకాశముంది. సుమారు 18–24 నెలల్లో మొదటి దశ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
రియల్ ఎస్టేట్‌పై ఆర్థిక ప్రభావం
విశాఖ జిల్లా ఆనందపురం మండలం, తర్లువాడ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు రాకతో ఆ ప్రాంత ఆర్థిక పరిస్థితులు మారనున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగంగా పుంజుకుంది. గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజం ఇంత భారీ పెట్టుబడితో రావడం ఆ ప్రాంతానికి పెద్ద మలుపు తిప్పే పరిణామం కానుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక టెక్ నిపుణులకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి.
విశాఖకు గేమ్ ఛేంజర్
గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్‌తో దేశ టెక్నాలజీ రంగంలో కొత్త చరిత్ర సృష్టించనుంది. ఆసియా ఖండానికే కీలక ఏఐ గేట్‌వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక డేటా సెంటర్‌తో అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖ శాశ్వత స్థానం సంపాదించనుంది. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో, 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలవనుంది. త్వరలో సబ్‌సీ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖకు అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. ఈ డేటా సెంటర్ ద్వారా భారీ డేటా నిల్వతో పాటు ఏఐ క్లౌడ్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
పోర్టు సిటీ నుంచి డేటా సిటీగా
విశాఖ తీర ప్రాంతం కావడంతో సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంది. తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.5 గిగావాట్ సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్ నిర్మించాలన్నది ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడనున్నాయి. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్‌వర్కింగ్ రంగాల్లో కూడా అనుబంధ పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది.
విశాఖకు అంతర్జాతీయ హంగులు
గూగుల్ ఏఐ క్లౌడ్ సేవలతో విశాఖ ఆసియాలో ప్రముఖ టెక్ కేంద్రంగా ఎదగనుంది. ఐటీ స్టార్టప్‌లు, రీసెర్చ్ సెంటర్లు, సెమీకండక్టర్ సంస్థలు విశాఖ వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉంది. గ్రీన్ ఎనర్జీ సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలతో విశాఖ గ్లోబల్ నగరంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ‘వికసిత్ భారత్ 2047’ విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో గూగుల్ ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుంది.
