Kavitha | అషూర్ఖానాలకు వెంటనే నిధులు ఇవ్వాలి
Kavitha | అషూర్ఖానాలకు వెంటనే నిధులు ఇవ్వాలి
మొహర్రం ఏర్పాట్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కవిత
Kavitha | ఆంధ్రప్రభ, హైదరాబాద్: మొహర్రం సంతాప దినాల్లో భాగంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ చారిత్రాత్మక బీబీకా ఆలంను సందర్శించారు. ఈ సందర్భంగా మొహర్రం ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆమె విమర్శించారు.
మొహర్రం సందర్భంగా అషూర్ఖానాల నిర్వహణ, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపులు చూపిస్తున్నప్పటికీ, నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.

మొహర్రం అంటే హజ్రత్ ఇమామ్ హుస్సేన్ కర్బాలా మైదానంలో చేసిన త్యాగం గుర్తుకు వస్తుందని పేర్కొన్న కవిత, మానవీయత, సత్యం, ధర్మం కోసం ఆయన చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. సమాజంలో న్యాయం, సత్యం కోసం నిలబడే సందేశాన్ని మొహర్రం అందిస్తుందని చెప్పారు.
నిజాం కాలం నుంచి హైదరాబాద్లో అన్ని మతాల ప్రజలు కలిసి పండుగలు జరుపుకునే గొప్ప సంస్కృతి కొనసాగుతోందని ఆమె గుర్తుచేశారు. బీబీకా ఆలం ఊరేగింపులో ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేదని, ఆ సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమంపై ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపాలని, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నిధుల విడుదల, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కవిత కోరారు.
