చదువుతోనే మంచి భవిష్యత్తు..

వసతి గృహాల విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా


మొవ్వ – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పామర్రు నియోజకవర్గ పరిధిలోని మొవ్వ, కూచిపూడి గ్రామాల్లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల, బాలుర వసతి గృహాల విద్యార్థులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ముఖ్య అతిథిగా హాజరై, ప్రభుత్వం నుండి మంజూరైన దుప్పట్లు, టవల్స్, స్వెటర్లు, నైట్ డ్రెస్సులను వసతి గృహ విద్యార్థిని విద్యార్థులకు స్వయంగా అందజేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం సాంఘీక సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, సమాజంలోని ప్రతి వర్గాన్ని, ముఖ్యంగా నిరుపేద విద్యార్థులను ఆదుకోవడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని పేర్కొన్నారు. వసతి గృహాల్లో ఉండే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రోజువారీ అవసరాలకు తగిన కనీస సదుపాయాలను సమకూర్చడమే ధ్యేయంగా ఈ అత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. చదువు, కనీస వసతుల విషయంలో విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని, తమ తల్లిదండ్రులకు, ఊరికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

మొవ్వ, కూచిపూడి గ్రామ ప్రజలు, వసతి గృహాల సిబ్బంది తనకు అందించిన ఘన స్వాగతానికి, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే, అందరి ఆశీస్సులతో పామర్రు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వసతి గృహాల సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.