AP | 300మందికి పైగా ప్రమోషన్లు…
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లకు ఎట్టకేలకు శుభవార్త అందింది. వారికి పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సర్వీసు నిబంధనలకు సడలింపు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 300 మందికిపైగా గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లకు త్వరలోనే పదోన్నతులు లభించనున్నాయి.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడంతో వార్డెన్లలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంతో ప్రమోషన్ల ప్రక్రియ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు 2008 నుంచి సర్వీసు నిబంధనల్లో సడలింపు కల్పించాలని నిరంతరం ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ గత ప్రభుత్వాల హయాంలో ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు.
ఈ అంశంపై మంత్రి సవిత ప్రత్యేక దృష్టి సారించి ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించారు. అనంతరం సర్వీసు నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పదోన్నతులకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ నిర్ణయంపై గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించిన మంత్రి సవితకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు ఇప్పుడు అందుబాటులోకి రావడం తమ జీవితాల్లో కొత్త ఆశలు నింపిందని వారు పేర్కొన్నారు.
