నారాయణపేట-మక్తల్ రోడ్డుపై నిలిచిన రాకపోకలు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం విజయ కాటన్ మిల్లు వద్ద ఏర్పాటు చేసిన సీసీఐ(CCI) కొనుగోలు కేంద్రంలో ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఈ రోజు నారాయణపేట- మక్తల్(Narayanapet – Maktal) ఆర్ అండ్ బీ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రైతులు చేపడుతున్న రాస్తారోకోకు బీఆర్ ఎస్ నాయకులు వడ్ల గంగాధర్ చారి మద్దతు పలికారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం క్వింటాలకు కాపాస్ కిసాన్ యాప్(Capas Kisan App) ద్వారా 12 కింటాలు కొనుగోలు చేసేందుకు ఆన్లైన్ నమోదు చేసుకొని రైతులు పత్తి విక్రయించేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రానికి రాగా ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని కొర్రీలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న ఊట్కూర్ ఎస్సై రమేష్(Ootkur SI Ramesh), మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి సీసీఐ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

