అర్ధరాత్రి చెత్త దహనం… అంబాపురంలో విషపు పొగ..

  • వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భయంతో గ్రామస్తుల ఆందోళన..
  • బయట ప్రాంతాల చెత్తను గ్రామ శివారులో కాల్చేస్తున్నారన్న ఆరోపణలు..
  • అర్ధరాత్రి పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసినా స్పందన లేదని ఆగ్రహం
  • ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న అధికారులపై చర్యలు కోరిన గ్రామస్తులు
  • కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా అధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్

విజయవాడ రూరల్ (వెస్ట్), ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ పరిధిలోని అంబాపురం గ్రామంలో అర్ధరాత్రి వేళ చెత్తను తగలబెడుతున్నారన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. గ్రామ శివారులోని ఐడీసీ, ఇరిగేషన్ కాలువ కట్ట ప్రాంతంలో బయట గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా తరలించిన చెత్తను పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రాత్రి వేళల్లో దహనం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి జరిగిన చెత్త దహనంతో గ్రామమంతా దట్టమైన విషపు పొగ వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో ఇలాంటి చర్యల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దట్టమైన పొగను గమనించిన గ్రామస్తులు వెంటనే గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు చల్లగాలి సునీల్‌కు సమాచారం అందించారు. ఆయన అర్ధరాత్రే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు ఫోన్ చేసి చెత్త దహనాన్ని నిలిపివేయాలని కోరినా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు కొమ్ము ప్రకాష్ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు..ఈ సమస్యను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని సునీల్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యేతో మాట్లాడతానని ప్రకాష్ తెలిపారు.

ఇరిగేషన్ కాలువ కట్ట రైతులు నిత్యం వినియోగించే ప్రాంతమని, అక్కడ చెత్తను కాల్చడం వల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త దహనం కారణంగా విషపూరిత పొగ గ్రామంలోకి వ్యాపించి చిన్నారులు, వృద్ధులు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ సిబ్బంది తమ తీరు మార్చుకోవడం లేదని ఆరోపించారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఈ వ్యవహారంపై కాలుష్య నియంత్రణ మండలి, ఎంపీడీవో, తహసీల్దార్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.